Sunday, August 31, 2008

సెల్ మోహన రంగా




కొత్తగా ఉద్యోగంలో జేరాను..చాలా హాపీగా ఉంది……ఆఫీసు దూరమైనా ఇష్టపడే రంగం అవడంతో …మంచి జీతం కూడా కావడంతో ఎగిరి గంతేసి మరీ చేరిపోయా..జేరిన రెండు రోజులకే అఫీసు వాళ్ళు ఒక ఫోను కూడా ‘ప్రెజెంటు ” చేశారు..(అది నా ఫ్యూచరు తో ఆడుకుంటుందని నాకు తెలీదు).
మనలో మనం మాట్లాడుకోడానికి ఫ్రీ.. అన్నారు..ఆహా కత్తి..మనకి తిరుగు లేదు అనుకున్నా…సిమ్ము మాత్రమే మేమిస్తాం ఫోను మీరు కొనుక్కోవాలి అన్నారు …ఇదెక్కడి అన్యాయం అందామనుకున్నా సిమ్ము కూడా లాక్కుంటారని వూరుకున్నా….సరే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని ఒక వెయ్యి రూపాయలతో ఒక అద్భుతమైన ఫోను కొందామని రోజూ టీవీల్లో కనిపించే అన్ని రకాల ఫోఅనులూ అవి పట్టుకున్న అమ్మాయిల్ని తలుచుకుంటూ బాజారుకు బయలుదేరా…వీధికొక టి వెలిసిన మొబైలు షాపులన్నీ తిరిగా..కలరు మొబైలు..కెమేరా..బ్లూటూతు…నా బొంద టూతు లాంటి ఫీచర్లు చాలా నాకు అర్ధం కానివన్నీ చూపించారు..ఏది ఎందుకు పనికొస్తుందో అసలు అవి ఎందుకు వాడతారో అర్ధం కాలే..ఇంక మొబైలు ని మొబైలుగానే వాడే నా అమాయకత్వానికి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రోజులు మారాయి సార్..మీ దగ్గరున్న వెయ్యికి మెమరీ కార్డు మాత్రం వస్తుంది…లేదా మెళ్ళో వేసుకునే మొబైలు గొలుసు..బెల్టుకు పెట్టుకునే పౌచు వస్తాయి….ఎలాగూ కంపెనీ సిమ్మే కద సార్ మొబైల్ మంచిది కొనుక్కోండి…ఆఫీసులో నలుగురిలో దర్జాగా తిర్గండి…అంటూ శ్రీ క్రుష్ణుడి లెవల్లో సెల్లోపదేసం చేశారు….
సెల్లు దాని విశిష్టత…అందులోని ఉప ‘యోగాలూ లాంటి పద్దెనిమిది అధ్యాయలు కల పుస్తకం ఒకటి ఇస్తామనీ అందులో సకల విషయాలూ ఉంటాయనీ..దానికి పెద్దగా బుర్ర ఉండక్కర్లేదనీ..మోటుగా మోటివేషన్ చేసి…నన్నూ ఒక సెల్లు ఓనర్ని చేసేందుకు ఉద్యుక్తుణ్ని చేశారు..
ఎన్ని చెప్పినా నా దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలే అన్నా….దానికి మళ్ళీ నామీద తెగ జాలిపడిపోయి..క్రెడిట్ కార్డుమీదైనా ఇచ్చేస్తాం సార్..మీరు మాకు బాగా నచ్చారు…ఈ విషయం ఎవరికి చెప్పకండి మీకు మాత్రమే మేమిస్తున్న అద్భుత అవకాశం…కాక పోతే ఈ పది వేలకి మీరు మరో 3 వేలు ఎక్కువ కట్టాలి అది కూడ వాయిదల పద్ధతిలో….2 ఏళ్ళ పాటు కట్టుకోవచ్చు అని రాయితీలు ప్రకటించి నేను చార్మి ఫొటోలు మరో ఆంగ్లవనిత ఫొటోలు చూసే లోపల నా కార్డుని గీసేసి రసీదులు తెచ్చేసి నా ఆటోగ్రాఫులు తేసేసుకుని..మీరు చాలా అద్రుష్టవంతులు సార్…మీ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే పంపండి అంటూ పళ్ళికిలిస్తూ సాగనంపారు….
అదేంటో సిమ్ము పెట్టగానే నేను ఇంకా నా నంబరు ఏంToa తెలుసుకోలేదు…ఎవరికీ ఇవ్వనూ లేదు.కానీ మొగింది కళ్యాణ వీణ అన్నట్టు ట్రింగు మంటూ మోగింది…సరే ….ఒక వేళ షాపు వాడమైనా చేశాడేమో…వాడికి తెలివి ఎక్కువ కదా,,ఫోను వాడిది కదా…నంబరు తెలిసి పోతుందేమో వాళ్లకి కంగ్రాట్స్ చెబుదామని చేసుంటాడనుకుంటూ హలో అన్నా….నా హలో మొదలవకుండానే …..ఏరా ఎన్నాళ్ళు దాక్కుంటావురా..ఫోను ఆపేస్తే నాలుగుసార్లు ట్రై చేసి వదిలేస్తాననుకున్నావా ? నేనెవరో తెలిసినట్లు లేదు నీ….అంటూ తిట్ల దండకం మొదలైంది….కంగారుగా ఎవరండీ అది నేను ఎవరో తెలుసా…మీకెవరు కావాలి అని అడిగా…ఏర కొత్త నాటకమా…గొంతు మారిస్తే గుర్తు పట్టలేననుకున్నావా……నీ…….మల్లీ సరికొత్త బూతులు…ఏవండోయ్ ఇది ఆఫీసు నంబరు నాపేరు అది కాదు… ఇవ్వాళ్ళే కొత్తగా ఇచ్చారు మీరడిగిన మనిషి ప్రస్తుతం మాదగ్గర పనిచేయడంలేదు….అని గడ గడ (వణుకుతూ) చెప్పేసా ……
మర్నాడు ఉదయమే ఆఫీసులో ఆ సిమ్ము ఇచ్చేసి కొత్తది నేనే కొనుక్కుంటా అని చెప్పేసి మళ్ళీ కొట్టుకొచ్చా ….సార్ బాగున్నారా ఎలా ఉంది కొత్త సెల్లు….కత్తి కదూఉ..అంటూ చిన్నపటినుంచీ పరిచయమైన వాణ్ణి అడిగినట్లు అడిగిన ఆ సేల్స్మాన్ కి జరిగినదంతా (బూతులు మినహాయించి) చెప్పేసా..సహాయం చెయ్యమని అడిగా,,,వెంటనే.. ఆ సేల్సు మాను తిరిగి తన విశ్వ రూపం చూపించి మొదలెట్టాడు….
అర్జునా(ప్రస్తుతానికి నేనే)
కాల్ చేసే దెవరూ. .కాల్ రిసీవ్ చేసుకునేదెవరు అంతా సాటిలైటులో కే వెళ్తుంది..
అన్ని కాల్సు నాలోనే ఇమిడి ఉంటాయి…చాతుర్వర్ణం మయా స్రుష్టం ..నాలుగు ఫోనులూఈ ఎయిర్ టెల్, ఐడియా. వోడా ఫోనూ..రిలయన్సు..టాటా అన్నీ నారూపాలే….యదా యాదాహి కాలస్య తదాత్మానం బిల్లామ్యహంనువ్వు చేసే కాల్ ని బట్టి బిల్లు ఉంటుంది…
ఎప్పుడైతె పుణ్యం లా బాలన్సు ఇపోతుందో అప్పుడు లైఫ్ లా ఫోను కట్ అయిపోతుంది…కాబట్టి కొంచెమైనా నెలకోసారి పుణ్యం రీచారుజు చేసుకుంటూ వుండాలి..
ఎప్పుడూ నాగొంతు వినిపించడానికి రింగుటోనులు,,హెలో ట్యూనులూ ఉంటాయి …
ఇలాంటివి చాలా ఉన్నాయి కమాన్ అర్జునా లే తీసుకో సెల్లు ని స్థాపించు సిమ్ముని సంధించు కాలుని అంటూ కర్తవ్య బోధ చేశాడు…అక్కడ మొదలెట్టిన పరుగుని ఇంటిదాకా ఆపలేదు..బాబోయ్ సెల్లు…

Wednesday, August 27, 2008

విత్తు ముందా చెట్టు ముందా..

విత్తు ముందా చెట్టు ముందా..గుడ్డు ముందా పక్షి ముందా...పతకం ముందా పధకం ముందా...అన్నది నాకు తెలియటంలేదు...పక్షి గూడు స్టడియంలో...దేశ దేశాలు పతకాలూ..పతాకాలూ మోసుకుని బై బై చెప్తుంటే మనవాళ్ళు..అందరూ కలసి ముచ్చటగా మూడు పతకాలని మోసుకుని వచ్చారు...చిన్న దేశాలనుంచీ చైనా దేశం దాకా అందరూ పతకం కోసం పోరాడారు...మన వాళ్ళు ఒకా పతకం సాధిస్తే 100 పతకాలు సాధించినట్టు...మనదగ్గర చాలా భాషలు భాషాలూ కదా...

ఒక మెడలు గెలిస్తే మెడలు వంగిపోయేలా సన్మానాలూ, సత్కారాలూ, బిరుదులు,,,మెడలు పెట్టుకోవడానికి మేడలు...స్థలాలూ,ప్రమోషనులు,,యాడ్లూ,,,రాష్ట్రపతులతో విందులు..ఇక తరువాతి ఒలంపిక్సు గురించి ఆలోచించడానికి కానీ. తమ విజయ రహస్యం పంచుకోవడానికి టైము కానీ...మరికొందరికి స్ఫూర్తినిచ్చేఅ తీరిక కానీ ఎక్కడుంటుంది..మనోళ్ళకి....

పోరాడి ఓడిన వాళ్ళు కొందరు...అసలు ఎందుకెళ్ళారో తెలీని వాళ్ళూ కొందరు...ఈ ఆటగాళ్ళ వెనకాల అంత మంది పటాలం ఎందుకో...ఏదో కోచు, ఫిజియో, ట్రైనరు...నలుగురో ఐదుగురో సిబ్బంది..వెళ్తే చాలు కదా సంబంధం లేని సిబ్బంది....మంత్రులు...వాళ్ళ సిబ్బంది....ఇలా ఎందరో మహానుభావులు....ఎందుకీ దండగ కదా...

మనవాళ్ళు ఇక్కడ ఏదో మైలు రాయి సాధించగానే వాళ్ళని ఎంపిక చేస్తారు..కానీ అది అంతర్జాతీయంగా..ముఖ్యంగా ఒలంపిక్స్ స్థాయిలో ఎంత దగ్గరలో ఉన్నారో ఆలోచించరు...ఒక సారి విక్రమం చూపితే ఇక రాబోయే తరాలవరకూ వారే హీరోలు...రాజీవ్ ఖేల్ రత్నలు...ఇంకా చాలాలూ.....

అసలు ఒలంపిక్స్ కి నాలుగేళ్ల ముందు నుంచీ లేదా అవసరమైతే ఎనిమిదేళ్ళ ముందు నుంచీ తర్ఫీదు ఇచ్చి కేవలం పతకమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో రెడీ అయితే గానీ పోటీలకు వెళ్ళడం వేస్టు...

గెలిచాక ఇచ్చే ఈ నజరానాలు..సన్మానాల కోసం చేసే ఖర్చు..అధికారుల విజిట్ కయ్యే ఖర్చులు....వగైరాలన్ని సరైన శిక్షణ నిచ్చే స్పోర్ట్ సెంటర్లపై పెట్టి మంచి పౌష్టికాహారం ఇచ్చి..మంచి శిక్షకులతో శిక్షణ ఇప్పిస్తే 100 కోట్ల భారత్ లో షెల్స్లు..తయారుకారా...చిరిగిన బూట్ల తో పరుగులు...అతుకుల బొంతల మీద కుస్తీలు...బురద ట్రాకుల మీద జంపులు....బయలు దేరేదాక జేరని కిట్లు....అందజేసి..పతకాలు రమ్మంటే ఎక్కడనుంచి వస్తాయీ....స్టదియాలకి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి వుండే ఇంట్రెస్టు...ఆటగాళ్ళ పేర్లు గుర్తుంచుకుని..వాళ్లకి వెళ్లవలసిన సదుపాయాలు చేరుతున్నాయా లేదా అని చూడ్డం చేతగాని వాళ్ళున్నంతవరకూ..పరిస్థితి ఇంతే....

ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ సంఘం మనది క్రికెట్ మీద వచ్చే డబ్బు ని వేరే క్రీడలకి ఉపయోగించకూడదా...ఎంత సేపూ ధోనీకి అవార్డు..స్థలం..సానియాకి స్పాన్సర్షిప్పు......అని తప్ప కుస్తీ యోధుడికి పిస్తా పప్పు....రన్నింగు సోభకి జాగింగు షూస్....అంజూ జార్జికి ట్రాక్ సూట్...వైట్లు ఎత్తే వాళ్ళకి కావలసిన సదుపాయాలు.....ఎప్పటికి వస్తాయో... ఏమిటో....

ఏది ఏమైనా త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్ళిన ప్రతీ వాళ్ళూ స్వర్ణపతకం తో తిరిగి రావాలని కోరుకునే ఓ సగటు పిచ్చి క్రీడా అభిమాని....

Tuesday, August 26, 2008

సినిమా రెడీ

సినిమా రెడీ
టైటిలు బ్యానరు ఓకే ఐపోయాయి..జెండా..ఎజెండా కూడా రెడీ...టైటిల్ సాంగ్ కూడా అయిపోయింది..ప్రెస్ మీట్లో హీరో కం డైరెక్టరు ఎనౌన్స్ మెంట్ ఐపోయింది...
ఇక వేర్వేరు లొకేషన్లలో ఔట్ డోర్ మిగిలింది...ఎలాగూ అన్ని జిల్లాల నుంచి డిస్టిబ్యూటర్లు వచ్చి హక్కులు తీసుకుంటారు..
కాకపోతే వోపెనింగు డైలాగుల్లో పంచు కొంచెం తక్కువైందేమో అనిపించింది..కాకపోతే అన్నయ్య మీద అభిమానం కొద్దీ ఇంట్రడక్షను ఓకే ఐపోయింది...ముందు వేసిన న్యూస్ రీల్ లాంటి ప్రోగ్రాం కూడా 'మనో' టనస్ అయిపోయింది...మనో తో ప్రగతి ని సాధించే కన్నా అన్నయ్య సినిమా క్లిప్పులు...రక్తదానం..నేత్రదానం లాంటివి ఏవి వేసిన కాస్త స్ఫూర్తి దాయకంగా ఉండేవేమో...పేజీల కొద్ది కష్టాలను చదివెయ్యకుండా...స్వయంక్రుషి తో చెప్తే ఇంకా బాగుండేది.....తమ్ముళ్ళ ఉత్సాహం .....ప్రోత్సాహం అన్నయ్యకి కొండంత అండ...ఏడుకొండల మధ్య ...మొదలైన ఈ సినిమా గొప్పగా ఆడాలని ...అభిమానుల ఆకాంక్ష....`

Sunday, August 24, 2008

చిరుపతి

చిరుపతి
ఆగస్ట్ 26 తిరుపతి - చిరుపతి గా మారుతోంది..ఇలా అనకూడేఅమో కానీ ఏర్పాట్లూ, అభిమానుల ఉత్సాహం చూస్తోంటే అలా అనాలనిపిస్తోంది.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల గుండెల్లో 'రైళ్ళు ' పరిగెత్తే రీతిలో తిరుపతి స్టేషన్ రెడీ అవుతోంది.. మెగా రైలు కద్లడమే తరువాయి.. చిరు మనసులోది ఏదైనా ఇట్టే 'అల్లు ' కు పోయే బావ మరిది 'అర ' విందు (పూర్తి విందు చేసే టైము లేదు ఆయనకి) దగరుండి ప్లాట్ఫాం పనులు చేయిస్తున్నారు..సి సి టీ వీ లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టంలు వగైరాలన్నీ తయారౌతున్నాయి.. ఇలాంటి పనుల్లో పని ' రాక్షసులు ' విజ్ క్రాఫ్ట్ ' విలేజ్ క్రాఫ్ట్ మొత్తం చూసుకుంటోంది..చిరు - అల్లు కాంబినేషన్ క్రుష్ణుడు - అర్జునుడు లా దేనినైనా ఎదుర్కునేలా రెడీగా ఉన్నారు.. టెస్ట్ రన్ మొన్నే అయినా అసలు ప్రయాణం 26న 'పచ్చ ' జెందా ఊపుతున్నారు.. (కాషాయం, త్రివర్ణం, పసుపు, ఎరుపు, వూదా, క్రుష్ణ నీలం, పింకు తలా ఒకళ్ళు పంచుకున్నారు కాబట్టి మిగిలింది ఇక ఆకు పచ్చే అని నా అభిప్రాయం ). గార్డు విగిలేయగానే ప్రయాణం స్టార్టు.. 10 కోట్ల మందినీ ఎక్కమంటున్నా టికెట్టు ఎంతమందికి దొరుకుతుందో తెలీదు..సీనియర్ సిటీజనుల ' కి (ఓయర్)బర్తు ఖాయం..యూత్ స్టాండింగ్లో అయినా రెడీ గా ఉన్నారు.. out standing యూత్ కి పెద్ద పీట వేసే అవకాశం ఉంది..అన్ని పార్టీల్లోనూ wait list లో వున్న వాళ్ళు 'ఎనౌన్స్ మెంట్ ' కోసం వైట్ చేస్తున్నారు..ఉన్న పార్టీ లో రెజర్వేషన్ కాన్సిల్ చేసుకుని R A C లో మెగా రైలెక్కడానికి చాలామందే రెడీ గా ఉన్నారు...
యూ ఆర్ ఎటెన్షన్ ప్లేజ్ తిరుపతి To అసెంబ్లీ వెళ్ళే చిరు ఎక్స్ ప్రెస్ 26-8-08 న బయలుదేరడానికి సిద్ధం గా ఉంది....

Sunday, August 17, 2008

కొత్త చిరంజీవి(తం)



కొత్త చిరంజీవి(తం)
(నేనేమీ చిరంజీవి ఫానుని కాను అత్లా అని ఇంకెవరికో కాను..ఎలాగూ వచ్చేశాడు కదా అని
ఇలా...)



మొత్తానికి ...చిరంజీవికి కొత్త జీవితం మొదలైంది..చిరంజీవి కొత్త పార్టీ మొదలైంది...ఆంధ్రా
అంతటా కూడా పార్టీలు మొదలయ్యాయి..కొందరు ఆనందం తో, కొందరు టెన్షన్ తో..కొందరు
ఇంకో కారణం తో...
సినీ రంగం లో ఎలాంటి "పునాది రాళ్ళు" లేక పోయినా "స్వయం క్రుషి " తో సినీ రంగంలో
'జగదేక వీరుడు ' అనిపించుక్కున్నాడు..
రాజకీయాలలో 'ప్రాణం ఖరీదు" చాలా తక్కువ..'ఊరికిచ్చిన మాట ' కోసం అభిమానులు
మోస్తున్న 'మంచుపల్లకీ'లో వస్తున్నా..ఈ 'యుద్ధ భూమి ' లో ..'మంచి దొంగ ' లు
ఉండరు..అంతా..
'రాక్షసులూ,'గూండాలూ, 'కిరాతకులూ, 'యమకింకరులూ
''మరణ మ్రుదంగం' , 'రుద్ర వీణ'లు
వాయించే ఈ రాజకీయాలలో 'చంటబ్బాయి' ఎలా
నెట్టుకొస్తాడో ఏమిటో ? చూడాలని ఉంది
'ఆపద్బాంధవుడి' లా రక్త దానాలతో ఎంతో మంది 'పసివాడి ప్రాణా 'లు కాపాడి , ఎప్పటికీ
'చిరంజీవి' గా ఉండేలా నేత్ర దానాలు చేయించి, అందరి ఆశీస్సులు మోస్తున్న ఈ
'ముఠా
మేస్త్రీ',
ఎన్నికలలో గెలిచి 'విజేత' కావాలంటే..రిగ్గింగులు చేసే..'స్టేట్ రౌడీ'లని,
పోలీసు మామల తో దోస్తీలుండే 'రౌడీ అల్లుళ్ళ'నీ కూడా ఒక కంట కనిపెట్టాలి...పని పట్టాలి..
తమ్ముళ్ళని జాగ్రత్తగా హాండిల్ చెయ్యడం ఒక 'చాలెంజ్'. మెగా అభిమానం తో వాళ్ళు చేసే కొన్ని
పనులు కొంచెం శ్రుతి మించినా ప్రాబ్లమే! అందుకు, 'అన్నయ్య ' 'హిట్లర్ ' లా
ఉండాలి..మరి దానికి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో ?
చంద్రబాబు, రాజశేఖరుడు, చంద్రశేఖరుడు అనే 'ముగ్గురు మొనగాళ్ళని ' ఎదుర్కొనాలంటే
తమ్ముళ్ళు చాలా గట్టిగా పనిచెయాలి..'బావగారు బాగున్నారు ' కాబట్టి కొన్ని టెన్షన్లు ఆయన
తీసుకుంటాడు..ఈయన 'మంత్రిగారి వియ్యంకుడూ..అక్కడ వదిలేసి ఇక్కడకు వచ్చాడు
అంటూ వచ్చే 'మహానగరంలో మాయగాళ్ళు ' కూడా చాలా మందే వుంటారు..జాగ్రత్తగా
ఉండాలి..
'మనవూరి పాండవులు '..నాగేంద్రబాబు, 'తమ్ముడు ' కళ్యాణ్,అల్లు,మిత్రా తో
కలిసి,,ఆలోచించినా , ఇన్నాళ్ళ 'సంఘర్షణ ' ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి అభిమానుల 'అభిలాష ' తీర్చి 'ఇది కధ కాదు ' అని నిరూపించి ' మగమహరాజు ' గా నిలవాలి 'అందరివాడు ' గా నిలబడాలి అంటే ఈ 'గాంగ్ లీడర్ ' కి ఆ 'మంజునాధుడూ, 'త్రినేత్రుడూ',అంశ ఐన ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని
కోరుతూ.....

Thursday, August 14, 2008

మేరా భారత్ మహాన్


భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.....

కానీ ఎందులోనూ స్వతంత్ర్యం కనబడటంలేదు..ఆ మహనీయులు ఎంతో కష్టపడి తెచ్చిన స్వతంత్ర్యాన్ని మనం సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నామా? ఏదైనా సాధించి వాళ్ళ శ్రమ కు ఫలితం చూపించామా?

గాంధీ గారిని నాటు తుపాకి తో..ఇందిరా గాంధీ ని మిషిన్ గన్ను తో...రాజీవ్ గాంధీని బెల్టు బాంబుతో ఇలా ప్రగతిని విధ్వన్సకర బాటలో తప్ప సరైన దిశగా ఉపయోగించలేమా?

భారతీయ మేధో సంపద పక్క డేశాలకు వలస వెళ్ళిపోతుంటే విమానాశ్రయంలో టా టా చెబుతున్నామే కానీ.. అక్కడ పొందే గెలుపులు..నోబెల్ బహుమతులు..రోదసీ యాత్రికులు..వైద్య నారాయణులు చివరకు ఆయా దేశాల సిటిజనులుగా గుర్తించబడుతున్నందుకు ఆనందపడాలా ..బాధ పడాలా?

రేషన్ కార్డు కోసం చూసే వాళ్ళకన్నా..కన్న వాళ్ళను వదిలేసి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే
e-జెనరేషన్ అబ్రాడ్ మైండు పిల్లలని అలా పెంచిన ఈ జెనరేషన్ "మమ్మీ"-డాడీల కి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా?

పబ్బులెంబడి తిరిగి...తాగి వూగి వాగి తన్నులు తిని ఇంటికొచ్చే మగ పిల్లలు....నిన్న రాత్రి జరిగిన పొరపాటుకి వాంటింగులు (వాంతులు)వద్దనుకునే అన్ వాంటెడ్ 72 ఆడపిల్లలు....రేపటి గురించి ఆలోచిస్తున్నారా?

డిగ్రీ అవగానే కాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టైపోయి హై టెక్కు సిటీ లో ఐ టీ కంపనీలలో వెళా పాళా లేని ఉద్యోగాలలో వేల రూపాయల జీతాలకి జేరి ......ఆరోగ్యం చేజారి....పక్క సీటు వారితో ప్రేమలోకి జారి ...మొహం మొత్తాక ఐతే సారీ..లేక పోతే షాదీ...యేడాది తిరగకుండానే ఉద్యోగం తో పాటు .....భార్య భర్తలు కూడా తలో దారి...ఎన్నాళ్ళీ వైఖరి?

ఏమో..60 ఏళ్ళ స్వతంత్ర్యం..మనకేమిచ్చిందో...మనం ఎటుపోతున్నామో...

ఏది ఏమైనా మేరా భారత్ మహాన్

ధనానికి దాసోహం
ఆడదానిపై వ్యామోహం
అవసరానికి మాత్రమే స్నేహం
తానే గొప్ప అనే అహం
ఇక్కడి జీవ జనుల లక్షణం
జాగ్రత్త మాట మార్చగలరు తక్షణం

మేరా భారత్ మహాన్

JAI HIND

Monday, August 11, 2008

జలతారు రోడ్డు..జంట నరకాలు

జలతారు రోడ్డు..జంట నరకాలు
జలతారు అన్న పదానికి,,పదార్ధానికి మన తెలుగు సంస్క్రుతిలో ఒక ప్రత్యేకత ఉంది...అయితే..ప్రస్తుతం ఆ మాట మన రాజధాని నగరంలోని రోడ్లకు సరిగ్గా సరిపోతుందనుకుంటా...కానీ కొత్త భాష్యం చెప్పాలి ఆ మాటకి..
జలతారు..అంటే మెరిసేదనో...ఇంకోటో అసలు అర్ధం ఎలా ఉన్నా..జలం వస్తే కొట్టుకుపోయే తారు అని చెప్పచ్చు..మన రోడ్లని చూసి....
ఎంత రోడ్డుకి ఎంత మెటీరీల్ వాడాలి...ఎంత తారు..ఎంత సిమెంటు..ఎంత కంకర..ఎంత ఇసుక కలపాలి అన్నది రోడ్డు.దానిపై ట్రాఫిక్కు..వంటిపై కాక..సదరు కాంట్రాక్టరుకి లభించిన టెండరు ..సమర్పించుకున్న ఆమ్యాయాలూ..వగైరాపై ఆధారపడడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతుండచ్చు...కాకపోతే నష్టం అల్లా పాపం నగర జీవికే కాని...కాంట్రాక్టరుకి కాదు..కదా..
అసలే నిత్య వైతరిణి...డ్రైనేజీవనదులతో సతమతమయ్యే నగరజీవికి....వర్షానికి కొట్టుకుపోయే రోడ్లూ,,,విరిగిపడే ట్రాన్స్ఫార్మర్లు....కూలిపోయే వంతెనలు...తెరిచి వుండే మాణోళ్ళు....నరకం అనేది పైనెక్కడోలేదు..మహా నగరం గా ఇటీవల ఎన్నికైన మన నగరానికొస్తే చాలు..ప్రత్యక్షంగా చూడొచ్చు..
ప్రతీ కూడలిదగ్గర..నుంచొని..హెల్మెట్ లేదు..ఇంకోటిలేదు అంటూ పదో పరకో బాదే ట్రాఫిక్కోళ్ళు..జాం అయినప్పుడు పాపం ఎక్కడో ఇరుక్కుపోతారు...కొన్ని గంటల నరకం తరవాత ఏ చానెల్లోనో చూపిస్తుంటే ప్రత్యక్ష్యం అవుతారు...
మొన్న పడిన వర్షానికి పడవల్లో తిరగాల్సి వొచ్చిందంటే అర్ధం అవుతోంది..మన ప్లానింగు..అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఐర్పోర్టులు...అంతర్జాతీయ సమావేసాలూ..మహానగరం హోదాలు కాదు సామాన్యుడికి సరైన ఫుడ్డు..గూడు..రోడ్డు...అని ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది,,,ఎంతసేపూ ఈ రకం గా జరగడానికి ప్రస్తుత పాలనే కారణం అని ప్రతిపక్షం....అసలు పాత ప్రభుత్వ నిర్వాకమే ఈ దారుణానికి సిసలు కరణం అంటూ ఒకరినొకరు తిట్టుకోకపోతే అసలు ఇలా కాకుండా వుండడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తే బగుంటుందేమో...అత్యవసరమైతే తప్ప బయటకి రాకండి అని చెప్పకపోతే..ఆ పరిస్థితి రాకుండా చూస్తే మంచిది....

Friday, August 8, 2008

ఒలంపిక్స్

ఒలంపిక్స్
ఒలంపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అందరూ ' బీజింగ్ ' అంటారేమో..కానీ అసలు ఒలంపిక్స్ జరుగుతున్నది మాత్రం మన ఆంధ్రా లో..ఔను నిజం ఆంధ్రాలోనే..08-08-08 అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే..ఆంధ్రా ప్రజానీకం మాత్రం కొత్త రైలు కోసం ఎదురుచూసింది...కానీ ఎందుకో చిరు రైలు లేటైంది...ఏం ? ఎందుకు ? అంటే చిరు మందహాసమే సమాధానం,,,,అందుకే ఆ టాపిక్ వదిలేసి..ఒలంపిక్స్ వైపుకొచ్చా....

మన క్రీడలు..
జిమ్నాస్టిక్స్ : ఈ ఆటకి ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్..అధికారం లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాం అని నిరూపించుకోవడానికి ఆరోగ్యశ్రీ .. రెండు రూపాయల కిలో బియ్యం మంచినీటి పధకం అని రకరకాల విన్యాసాలు చేసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..ఈ విన్యాసాలు అప్పుడప్పుడు సోనియాని ఆకట్టుకోవడానికి కూడా చేసి చేసి బాగ ప్రాక్టీసులో వున్నారు...
హాకీ : తెలంగాణాకి వ్యతిరేకం కాదు..మాది ఎప్పటికీ సమైక్యవాదమే...అవసరమైతే తెలంగాణా ఇస్తాం..కలిసి వుంటే కలదు సుఖం...అంటూ తెలంగాణా వాదం తో డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు వెళ్తోంది తె దే పా..
పోల్ వాల్ట్ : పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యేక తెలంగాణా అనే కర్రతో సడంగా ఎగిరి నవతెలంగాణా లో దూకిన దేవేందర్ పతకం గెలుస్తాడో లేదో pole తోనే తెలుస్తుంది
కో కో : కాసేపు సోనియాతో భేటీ..తరువాత కో చెప్పి చంద్రబాబు తో మంతనాలు..ఆ తరువాత చిరంజీవితో కబుర్లు..మొత్తానికి తెలంగాణా తెస్తాం అంటూ కో కో ఆట ఆడుతున్నారు తె రా స
రన్నింగు : ఎన్ని పార్టీలున్నా ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా బంగారు పతకం - బంగారం లాంటి పాలన మాదే అంటూ రిలే "పరుగు " పందెం లో ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి..
స్విమ్మింగు : ఏతకొలనులో ఎటువైపు వెళ్ళాలో తెలీక నాలుగువైపుల ఉన్న అన్ని పార్టీల వైపు ఏదేప్రయత్నం లో వున్న కమ్యునిస్టులు ఈసారి ఎవరివైపు ఈది ఎవరిని గెలిపిస్తారో చూడాలి..
వైట్ లిఫ్టింగు : హిందుత్వ - రామాలయం అనే బరువులు మోస్తూ ఎప్పటికైనా ఫస్టు మేమే వస్తాం అప్పటిదాక wait చేస్తాం అంటూ వైట్లిఫ్టింగ్ చేస్తున్నారు..భా జా పా..
బీచ్ వాలీబాలు : ఆడేది బీచ్ వాలీబాలు లాంటి రాజకీయం అనే ఆట ఐనా మేము మొత్తం డ్రస్సు వేసుకునే ఆడతాం నైతిక విలువలు నిలుపుకోవడానికి వలువలు వేసుకునే పోరాడతాం..నిజాయితీగా ఆడతాం మా సత్తా చూపుతాం అంటూ నిత్యం రక రకాల డోపింగులు తీసుకునే వాళ్ళతో పోటీ పడుతున్నారు లోక్ సత్త వాళ్ళు..
మనమూ చూద్దాం ఈ పొలిటికల్ ఒలంపిక్స్ లో ఎవరు గెలుస్తారో .........

Saturday, August 2, 2008

టీవీ మాయ

టీవీ మాయ
సెకండ్ ఎపిసోడ్... ఇది టీవీ మాయ..
ఒక అత్త ఒక కోడలు,,ఒక పనికిరాని మొగుడు...ఒక పనిలేని మావగారు ...అనే నాలుగు కారక్టర్లు నాలుగు సంవత్సారాల కన్నీటి ధారవాహికల మధ్య పోరాటాలు..టీవీ స్పెషల్..పాపం ఆ హీరోయిన్ కి కష్టాలు ఎప్పటికీ తీరవు...ఒక భర్తకి ఇద్దరు భార్యలు....కుళ్లుకునే తోటికోడలు..చిచ్చులుపెట్టే ఆడపడుచు..అవమానించే అత్తగారు..హింసించే మొగుడు...మావగారు మాత్రం సపోర్టుంటాడు..ఇన్ని కష్టాలు భరిస్తూ...ఇంటి మొత్తాన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఆ కోడలు..ఒక కష్టం తీరిన వెంటనే తలుపు దగ్గర వైట్ చేస్తుంటుంది మరో కష్టం...ఇలా కొన సా ఆ ఆ ఆ ఆ ఆ అగుతూ పోతుంటాయి ఆ సీరియళ్ళు...అందులో వొదినా మరుదులుగా వేసిన వాళ్ళూ అకా తమ్ముళ్ళు గా వేసిన వాళ్ళు నిజ జీవితంలో ప్రేమించేసుకుని పెళ్ళి చేసుకునే అవకాశం కూడా వుంది...
ఇక లైవ్ ప్రఒగ్రాములు...మీరు అడుక్కోండి మేమేస్తాం అని ఫోన్ చేసి అడుక్కునే ప్రోగ్రాములు...వేళ్ళు నెప్పులు పుట్టేల నెల ట్రైచేస్తే....వాళ్ళకు నచ్చిన పాటలు వేస్తారు...
ఇక ఆట పాటల పోటీలు...
వీటికి ఏ ప్రాతిపదికన సెలక్టు చేస్తారో ఆ భగవంతునికే తెలియాలి..మధ్యలో ఏడుపులు..ఆత్మ హత్యా ప్రయత్నాలు..లేచిపోవడాలు..కొట్టుకోవడాలు..ప్రేమలు..యుద్ధాలు....అలకలు..నిందలు...నిష్టూరాలు..ఎస్ ఎం ఎస్ స్కాములు.....పక్షపాతాలు..ప్రాంతీయ తత్వాలు....సెంటిమెంటులు...యాక్సిడెంటులు.....సింపథీలు....జడ్జీల ఇగోలు...యాంఖరు పైత్యాలు...అబ్బో బోల్డంత మసాలా...ప్రేక్షకులతో ఆడుకునే ఇలాంటి ఆటలో ఎప్పుడూ గెలుపు వాళ్ళదే...కాలు జారి కిందపడ్డ ఆ అమ్మాయి మళ్ళీ ఆడిందా లేదా వొచ్చే వారం చూడండి...అంటూ ఉత్ఖంట రేకెత్తించి మధ్య మధ్యలో నేను చచ్చిపోతా అంటూ ఆమె ఏడ్చే సన్నివేశాలతో..యాడ్లు వేసి తరువాత వారం వరకు ప్రేక్షకుల్ని పట్టివుంచే ఎన్నో ట్రిక్కులు...అన్నీ మన ఆనందం కోసమే...ఇక పిల్లల మధ్యలో పోటీ ...వాళ్ళ కెరీర్లు ఏమౌతాయఓ తెలీదు...ప్రతీ పోటీలో ఒక్కరే విజేత...కానీ యాబహి రెండు వారాల వాళ్ళ ఆటలో వోడితే అన్నిరోజుల శ్రమ ఏమౌతుంది...చదువు ? హైదరాబాదులో జరిగే పోటీల కోసం వూర్ల నుంచి వచ్చి ఉండిపోయి చివరకు గెలవక ....బాధపడే ఎందరో అమాయకులకు సానుభూతితో ఈ పోస్టింగు...అంకితం

సినీమాయ

సినీ మాయలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది...ఒక్కొక్కరిది ఒక్కో మాయ..మొత్తానికి ఇంటిపట్టున వున్న ప్రేక్షకుణ్ణి ధియేటరుకి రప్పించే ప్రయత్నాలు...మా సినిమాలో హీరోయిన్ ఎన్ని చీరలు కట్టిందో లెక్క పెట్టి చెప్పండి...ఆ చీరలు మీకిచ్చేస్తాం అని ఒకప్పుడు అనేవాళ్ళు/..\ ఈ మధ్య ఒక పెద్ద రేడియోలో కూడా అలాంటి మాటే విన్నా..కధానయకుడులో ఆ హీరో వాడిన చొక్కాలు పాంట్లూ ఇస్తాం దీనికి సమాధానం చెప్పండి అంటు...ఒక రేడియో జోకరు...ఏవో దిక్కుమాలిన ప్రశ్నలు వేశాడు...పాపం అమాయక ప్రాణులు కొన్ని ఆ తిక్క ప్రశ్నలకు సమాధానాలు వెతికి పట్టుకుని...చెప్పారు...మరి వాళ్ళు గెలుచుకున్నవి నిజంగా ఆ సదరు హీరోగారు విడిచిన బట్టలేనా లేక? అవి వందసార్లు వేసుకుంటే ఒక్కసారైనా వుతుకుతారో లేదో మరి.....
ఇక సినిమా కోసం కావాలని కాంట్రవర్సీలు తయారు చేసి మరీ..ప్రజల మీదకి తోస్తున్నారు కొంతమంది తెలివైన వారు...ఫలానా సినిమాలో హీరోయిన్ బికినీ వేసుకుందట..ఆ సినిమాలో హీరోయిన్ ఐటం సాంగు చేసిందట..హీరో సిక్స్ ప్యాకుట.... బాలివుడ్డులో ఐతే ఇంకో స్టెప్పు ముందుకేసి...ఆ హీరో హీరోయిన్ పెళ్ళి చేసుకుంటునారు...పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు...ఆ ప్రేమ అంతా తెరమీద వొలకపోసారు మీరు తరించండి అంటూ ఊదరకొడుతున్నారు...సందిట్లో సడేమియా అంటూ ఆ జంట కూడా వీలైనంతగా కలిసి తిరిగుతూ అన్ని చోట్లా కన్నుల పండగ చేస్తుంటారు...ఒక వేళ ఎంత ప్రేమించుకున్నా..చివరకి పెళ్ళి చేసుకున్నా..తెరమీద మొత్తం చూపించలేరుగా....ప్రజల అమాయాకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్న నిర్మాతల తెలివి అమోఘం....దీపిక పదుకునే-రణ్బీర్, సయీఫ్ కరీనా...ఇలా చాలా పేర్లు జంటగా వినిపిస్తుంటాయి...మనకి..అసలు మోసపోవద్దు.. అవన్నీ పబ్లిసిటీ కోసం అంతే...
ఇటీవల రాం గోపల (దెయ్యాల) వర్మ... దమ్ముంటే నా సినిమా ఒంటరిగా చూడండి బోల్డంత డబ్బిస్తాను అని చాలెంజ్ చేశాడు...అలా అయినా ఆయన సినిమాకి జనం వస్తారనేమొ ఈ ఎత్తుగడ..ఎందుకంటే ఆయన సినిమాలకి వెళ్ళి సినిమా చూసి భయపడడం ఎలా వున్నా ఆయన సినిమాకి వెళ్ళాలంటే భయపడే స్థితిలో ఉన్నారు జనాలు....హాయిగా శివ..గోవిందా గోవిందా లాంటి సినిమాలు...రంగీలా లాంటివి తీసుకోక ఎందుకు నాయనా ఈ దెయ్యాలు భూతాలు.

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates