Wednesday, June 30, 2010

సంధ్య


 సంధ్యని చూసి ఎన్నాళ్ళయిందో..
సముద్ర తీరం లో ఇసుక లో వ్రాస్తూ..
కలల్ని చెరిపేసే అలలని చూస్తూ
చిరుజల్లులు పడుతుంటే అలా తడుస్తూ
దూరంలో కనిపిస్తున్న పడవల్ని లెక్కిస్తూ.
సంధ్యని చూసి ఎన్నాళ్ళయిందో..

పొద్దున్న లేస్తే హడావిడి జీవితం
ఒకటో తారీఖే అంతమయ్యే జీతం
పడుతూ లేస్తూ ఆఫీసుకు పరిగెట్టడం
మీటింగులు..చాటింగులు..ప్రెజెంటేషనులు.టెన్షనులు
డబ్బాలో కూరిన పెళ్లాం ప్రేమని లంచ్ టైము లో కూరలో కలుపుకు తింటూ
పొద్దున్న తను చెప్పిన విషయమేమిటో గుర్తుకుతెచ్చుకుంటూ
అమెరికాలో క్లయింటుకి పంపించిన మెయిలుకి జవాబుకోసం ఎదురుచూస్తూ
వర్షానికి ఊగి ఊగి ఊడిపడే హోర్డింగుకింద బిక్కు బిక్కు మంటూ
ఇంటికి చేరేసరికి పడుకున్న పిల్లలని నిద్రకళ్ళతో చూస్తూ ఉన్న నేను
సంధ్యని చూసి ఎన్నాళ్ళైందో

సా"యంత్రాలని" . చూడలేని ఓ పని యంత్రం



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Share/Save/Bookmark

Tuesday, June 29, 2010

యమదూత

ఒకప్పుడు రాజ్ దూత్ ఉండేది..ఇప్పుడు యమహా అని యమదూత వచ్చింది..ఏదో సినిమాలో చూసి,,మరో ఫ్రెండు దగ్గర చూసి..ముచ్చటపడి...అపోహ పడి..ఒక్కో సారి అవమాన పడి..అమ్మా నాన్నలకు అడ్డు పడి..కింద పడి మీదపడి..మొత్తానికి బైకు కొనేస్తారు.. సుమారుగా లక్ష పెట్టి బైకు కొంటారు కానీ..హెల్ మెట్టు కొనరు..వాడిచ్చినా వాస్తు ప్రకారం ఏదో గదిలో పడేస్తారు కాని..తలకి వాడరు. అసలే ఇరుకు రోడ్లు..ట్రాఫిక్ జాములు..పోలీసులు - చలానాలు - ఫలానాలు - ఫ్రెండ్స్ తో పోటీలు.. ఇంకేముంది ఆదివారం..మరో వూరు ప్రయాణం..హై వేలో వందకి పైగా స్పీడుతో రక రకాల విన్యాసాలు..పైత్యాలు..కోపాలూ - ప్రకోపాలూ.. ఎగసే వయసు...ఎగిరే బళ్ళు..ఎదురొచ్చే బస్సులు..ఆగిపోయిన లారీలు..జారిపోయిన చక్రాలు-అడ్డంగా వచ్చే గేదెలు..ఐనా మనం ఆగం...పోటీకో..మాటకో..మరోదానికో మొత్తానికి స్పీడుగా వెళ్లి ఏదో జరిగి..మనం గెలిస్తే దండ పడుతుందో లేదో కానీ...ఫొటోకి దండ పడడం .......



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, June 24, 2010

దేవుడా నీకెవరు దిక్కు??

దేవుడా నీకెవరు దిక్కు??

అప్పుడెప్పుడో మొసలి ఏనుగుని పట్టుకుంటే వచ్చి రక్షించాడట మహా విష్ణువు..ఇప్పుడు మొసళ్ళ లాంటి నాయకులు పట్టుకున్న ఆ విష్ణువు ని ఎవరు రక్షిస్తారో మరి. వరాలిచ్చే దేవుడే రాజకీయ నాయకుల ఉచ్చు లో బిగుసుకుని బయటకు రాలేక పోతున్నాడు. కలియుగ ప్రత్యక్ష్య దైవానికీ కలి ప్రభావం పాలక మండలి రూపం లో పట్టుకుంది.

రాబోయే ఐదేళ్ళవరకు కళ్యాణం టికెట్లు లేవు..మరి ఐదేళ్ళూ కళ్యాణాలు చేయించుకునే వాళ్ళు నిజం గా బుక్ చేసుకున్న భక్తులేనా...లంచాలు బుక్కి అమ్మేసారా?

2080 వరకూ ఆర్జిత సేవ టికెట్లూ బుక్ చేసుకోవచ్చు..ఇచ్చినవాళ్ళు కానీ పుచ్చుకున్న వాళ్ళు కానీ మరో 70 ఏళ్ళు బతికే ఉంటారా..మరి అవి ఎవరికి చేరతాయి ?

పెద్ద చేపలకు (కింగు ఫిషర్లు), ప్రత్యేక దర్శనాలకోసం రోజుల తరబడి క్యూలో వున్న భక్తులను ఆపి మరీ దర్శనాలు..అందుకు "ఆది" నుండీ ఆర్భాటం..

ఆర్జిత సేవలు స్వామివారికి...ఆర్జన ఎవరెవరికి ?

పాలక మండలి లో పాలెన్ని నీళ్ళెన్ని - ఏడుకొండలు ఎక్కి వచ్చే భక్తులను ఏడిపించే విధానాలు !!

పాలక మండలి లో ఉండే వారికుండాల్సిన అర్హతలేమిటి ??

పాలక మండలి డ్యూటీలేమిటి - భక్తులను లూటీ చేయడమా..???

పాపం ఈ ప్రశ్నలకు స్వామి వారి వద్ద కూడా సమాధానం లేక .. మౌనంగా మరో గుమ్మం వెనక్కి వెళ్ళాడు..

తిరుమలేసునికే నామాలు పెట్టి..భక్తులకి తిరు క్షవరం చేస్తున్న పాలక మండలీ ...గోవిందా గోవిందా

కళ్యాణ కట్టనుంచీ..కళ్యాణం టికెట్ల వరకూ...ఎవరి వాటా వారిదే - గోవిందా గోవిందా 

నడిచి వచ్చే భక్తూల సుదర్శనం - వీ ఐ పీ లకు బ్రేక్ దర్శనం గోవిందా గోవిందా.
మామూలు జనాలను వెనక్కి లాగుతాం - విజయ మాల్యాలకు ఘన స్వాగతం గోవిందా 
గోవిందా

తి తి దే అంటే 'తి 'నేస్తాం 'తి 'నిపిస్తాం 'దే 'వుడి సొమ్ము -- గోవిందా గోవిందా.

హుండీలో రూపాయలనుంచీ..బంగారు డాలర్ల దాకా గోవిందా గోవిందా.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...

Tuesday, June 22, 2010

వ్యర్ధం


 వ్యర్ధం
 
వేదం పఠించాలా పాటించాలా. అంటే సినిమాని సినిమాగా చూడాలా..
క్రిష్ దికాబట్టి ఏదైనా ఆశించి చూడాలా అన్నది అర్ధం కాలేదు.

ఏంటో నా చూపు దోషమో..ఆలోచనలో దోషమో కానీ అందరూ మెచ్చుతున్న వేదం నాకు నచ్చలేదు. నా కారణాలు నావి.
ఇది జరుగుతున్న నిజాలు చూపిద్దామనుకున్న సినిమానా ఏదైనా మెసేజ్ తో మార్పు కోరుతూ తీసిన సినిమానా అర్ధం కాలేదు. అసలు వేదం అనే పేరు ఏరకంగా దీనికి సరిపోతుందో కూడా అర్ధం కాలేదు.కాస్త ఎవరైనా చెప్పుదురూ.

నాలుగు  కధలు మొదలెట్టి.మధ్యలో మెలిపెట్టి .చివరలో కలిపి అందరినీ ఒక్క చోటికి చేర్చి కధాంతం చేసారు నాలుగు కధలుండడం వల్లనో ఏమో అస్సలు క్లారిటీ లేదు.

రాక్ స్టార్ అవుదామనుకున్న మిలిటరీ కుటుంబం వ్యక్తి - లేట్ గా వెళ్ళి ఫ్లైటు మిస్సు చేసుకుని..కారులో బయలుదేరితే ...దారిలో "తెలుగు "సింగు గారు రెచ్చగొట్టినందుకు..వారి కి తగిన శాస్తి చేస్తారు.
సింగు గారితో తెలుగు మాట్లాడించేకన్నా..చదువుకున్న రాక్ స్టార్ గారు హిందీ మాట్లాడచ్చు......సరే ఆ మాట వదిలేస్తే...ప్రేమికులని పట్టుకుని పెళ్ళిళ్ళు చేయడం లేదా రాఖీ కట్టించడం చేసే దళాలని విలన్ లు గా చూపించి..వాళ్ళు అమ్మాయిని బలవంతంగా లాక్కు పోయే వాళ్ళలా చూపించడం ఎంతవరకూ అవసరం..సమంజసం..   ప్రేమ పేరుతో మోజు తీరేదాకా తిప్పుకుని..కాపురాలు చేసి వదిలేసే ప్రబుద్ధుల స్టొరీ ఒక్కటైనా లేకుండా ఒకరోజైనా గడుస్తోందా..యాసిడ్ పొయ్యడాలూ..ఇంట్లోంచి పారిపోవడాలు లాంటివి కొంచెమైనా తగ్గుతాయేమో ..బయట కలిసి తిరిగుతుంటే.. పెళ్ళి చేస్తారేమోనని భయమన్న వాళ్ళని కంట్రోల్ చేస్తుందేమో..అని పిచ్చి ఊహ.

ఫైటింగులో దెబ్బ తిని..కిందకి దొర్లి..తలకి గాయమై..స్పృహ పోయి మళ్ళీ లేచాక..సరిగ్గా వాళ్ళు వెళ్లే దారికి అడ్డంగా వెళ్ళి 100 కిలో మీటర్ల స్పీడులో వెళ్లే బండిని ఆపి ఫైటింగు చేసే ఆ ఫీట్లన్నీ - రియల్ గా సాధ్యమేనా..సహజంగా తీసాడు అనిపించుకునే  డైరెక్టరు క్రిష్ కూడా ... ఇమేజ్ విషయం లో క్రష్ అయ్యారా అనిపించింది..

నాకు తెలిసి ఎంత జూబిలీ హిల్స్ లో నైనా..చివరికి సదరు హీరో గారింటికి కనెక్షనిచ్చే కేబుల్ రాజు..అంత పాష్ గా మైన్ టైన్ చెయ్యడం అసాధ్యం..పైగా ఏమాత్రం హెల్పింగ్ నేచర్ లేని మనిషి..సడెన్ గా మారిపోయి క్లైమాక్స్ లో చచ్చిపోవడం కూడా అనవసరమనిపించింది. పైగా కిడ్నీ డబ్బులు కొట్టేసి పారిపోయినట్టు గా కాకుండా...ఆ హీరోయిన్ తల్లి దగ్గరో..హీరోయిన్ గారి దగ్గరో కొట్టేసి ఆ పేద వాళ్లకి అందిస్తే కనీసం హీరోయిజం గా ఉండేదేమో..దర్శకుడు ఇంకో దృష్టిలో  ఆలోచించినట్టున్నారు..


అసలు కిడ్నీ అమ్ముకోవడం మంచిదా కాదా..అది నేరమా కాదా..అలా అమ్ముకోకూడదు అని ఎక్కడా చెప్పకుండా ప్రస్తుతం పేద వారికి అదో ఆదాయమార్గం గా ఉన్నది అని సూచించి నట్టుంది. ఇంకా ఆ విషయం తెలీని మారు మూల పల్లెల్లో సైతం ఈ సినిమా పుణ్యమా అని తెలిసి, ఎంత మంది తమ కిడ్నీలమ్ముతారో...నంది వచ్చేలోపు తెలిస్తే బాగుణ్ణు. ఆ పిల్లాడి చేత
లెక్కలేవో ముందే వేయించి వాడి ప్రతిభ గుర్తించి..ఆ డబ్బుతో మంచి ఇస్కూల్లో ఏస్తే..కనీసం తరువాతి తరాలకి ఆ పిల్లాడు సేవ చేస్తాడనన్నా మెసేజ్ ఉండేది అనిపించింది.. డబ్బు ఇచ్చి..మళ్ళీ లెక్క కట్టి...బెదిరించిన తరువాత కూడా..చివరికి ఆ పటేలే మంచోడయ్యాడు.

ఇక అనుష్క పాత్ర..ఆవిడ ప్రాబ్లెం ఆవిడదే..ప్రపంచంలో అలాంటి జీవితం కానీ ,,,కష్టం కానీ ఎవరు కోరుకుంటారు..పోనీ ఆ నరకం నుంచి బయటపడాలి అది ఇష్టం లేకుండా చేస్తున్న పని..అని కూడా ఎక్కడా వినిపించదు..ఎంతసేపూ స్వంత కుంపటి.(దుప్పటి అనాలేమో ).గురించే...మరి గ్లామరు కోసం కాక ఆ పాత్ర ఇంక దేనికి ఉపయోగ పడ్డదో వెంటపడ్డ బ్రహ్మానందం కి తెలియాలి.

ఇక ఖురేసీ ఎపిసోడ్ ఆల్రెడీ ఖడ్గం సినిమాలో చూసిందే..

నిజంగా సేవ చేసే ఒక గొప్ప వ్యక్తిస్ఫూర్తితో..కొన్ని మంచి ఆలోచనలతో 'గమ్యం' నుంచి ప్రారంభించి మరి క్రిష్ ఎటు పోతున్నాడో ? అర్ధం కాలేదు.

చాలా మంది..నీకు సినిమా చూడ్డం రాదు అని అన్నా నాకు అబ్యంతరం లేదు..దీని గురించి చర్చ వ్యర్ధం...







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, June 17, 2010

ట్రాఫిక్ ఫొటోగ్రాఫర్స్


 ట్రాఫిక్ ఫొటోగ్రాఫర్స్

పెళ్ళి కి ఫొ
టోలు తీస్తారు కాని..మన ట్రాఫిక్ పోలీసోళ్ళు ఫొటోలు తీసి పెళ్ళి చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ చేసి వెళ్ళిపోయే ప్రబుద్దులని పట్టుకోవడానికి చేసే ఈ ప్రయత్నం బాగానే ఉన్నా ఒక్కోసారి నాలాంటి అమాయకులు బలైపోతుంటారు. మొన్న ఖైరతాబాద్ దగ్గర సిగ్నల్ పడిందని ఆగా..గ్రీన్ పడ్డాక ఫ్లై ఓవర్ ఎక్కే ప్రయత్నం చేస్తుండగా..రాజ్భవన్ నుంచి వస్తున్న ఒక బైకర్ అడ్డం గా వచ్చి నన్నూ. బస్సుని..కారుని అడ్డగించి ఈనాడు వైపుకి స్పీడ్ గా వెళ్లాడు తప్పించుకునే ప్రయత్నం లో మేమంతా ఆగిపోయాము.. ఈలోగా రెడ్ పడడమూ అవతల నించీ వెహికిల్స్ రావడం తో ట్రాఫిక్ ఆగడమూ - ఫొటోలు తీయడమూ  జరిగిపోయాయి..వారం తరువాత ఇంటికి శ్రీముఖం ట్రాఫిక్ జంపింగు..100 కట్టుము అని..ఆ హా బైకు వాడు తప్పించుకుని నేను దొరికి పోయా అనుకున్నా...ఆటోల వాళ్ళు అంతే అడ్డదిడ్డంగా వచేసి ఇరికించుతారు..ఎర్ర రంగు వచ్చేసరికి నాలాంటి వళ్ళు ఇరుక్కుంటారు..ఇది ఇప్పటికి ఎన్నో సారో తెలీదు.సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ పాటించీ ఇలా తప్పు చేసిన వాళ్లా జరిమానా కట్టాల్సి రావడం బాధాకరం. అసలు వాళ్ళు తప్పించుకుంటారు..కనీసం సంజాయిషీ ఇవ్వడానికి కూడా వీలులేని ఈ రూల్ ఎంతవరకూ సమంజసమో ఆ పోలీసు అధికారులకే తెలియాలి. జనవరి 30 ఉదయం 11 గంటలకు గాంధీ గారు పోయిన టైములో వచ్చిన సిగ్నలు ప్రకారం హిమాయత్ నగర్ లో కారాపి మౌనం పాటించి నందుకు...రాంగ్ పార్కింగ్ పేరిట 200 సమర్పించుకున్నా..గాంధీ గారికి  శ్రద్ధాంజలి ఘటించినందుకు జరిమానా.. ఏం చేస్తాం..నీతి పాటించాలి అని చెప్పిన గాంధీ గారి బొమ్మ నోటు మీదున్నా ..లంచం గా ఆయన సాక్షి గా ఆ నొట్లనే జేబుల్లో నెట్టుకుని ..లైసెన్స్ లేని వాళ్ళని ఎంతమందిని వదిలేస్తున్నారో..ఆ గాంధీ గారే సాక్ష్యం..కెమెరాకి కళ్ళుంటాయి కాని మెదడుందదు...



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Wednesday, June 16, 2010

వాన

 వాన

పిల్లలకిష్టం పడవలేసి ఆడుకోవచ్చు
              పెద్దలకిష్టం పకోడీలు తింటూ పాడుకోవచ్చు
              యువ జంటలకిష్టం కలిసి తడిసి తిరగొచ్చు
              హైదరాబాదు రోడ్లకే కష్టం ...డ్రైనేజీవనదులు పొంగి పొర్లచ్చు
  ట్రాఫిక్కు జాములవ్వావచ్చు..హోర్డింగులు కూలావచ్చు - 
కరెంటు పోవావచ్చు -   




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Monday, June 14, 2010

పరమ స్ట్రిక్ట్ పోలిసోళ్ళు


 చలానాలకాడ చలాకీ వసూళ్ళు
కాగితాలు లేకపోతే మామూళ్ళు

ట్రాఫిక్కు జాములైన చోట కానరారు మనోళ్ళు
సీ ఎం కాన్వాయ్  వెళ్లే వరకూ పరమ స్ట్రిక్ట్ పోలిసోళ్ళు  









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Sunday, June 13, 2010

కృయాలిటీ షోలు

 బుడి బుడి నడకల వయసులో
అడ్డమైన డ్యాన్సుల మోజు

సిల్కు స్మితలూ జయమాలినీలనిపించుకొన
తలిదండ్రులకెందుకో అంత క్రేజు

ఆటలాడుకునే వయసులో
తీట కార్యక్రమాలు
చిన్నారుల పై వత్తిడి పెంచే
రియాలిటీలనబడే కృయాలిటీ షోలు




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి


naa paata Tapaa:
Apr 19, 2010

కృయాలిటీ షోస్



 ఒక చిన్న పాపాయి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అంతా ఎంతో పాపులర్. ఆమె పాట వింటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది..ఆ పాపని దగ్గరకు తీసుకుని నీ పేరేంటమ్మా అని అడిగా..పాప దిక్కులు చూసింది బహుశా వాళ్ళ అమ్మా నాన్న కోసం అనుకుంటా..వాళ్ళు కనిపించి తలకాయ ఊపాక చిరీచ అంది మొదట్లో అర్ధం కాలే తరువాత శిరీష అని అర్ధం అయింది..నువ్వు ఏం చదువుతున్నావ్ అని అడిగా పీ పీ వన్ అంది నాకర్ధం కాలే ...సరే నీకు ఏ బీ సీ లు వచ్చా అన్న,,ముద్దుగా తల ఊపింది.. చెప్పు అన్నా, మళ్ళీ అమ్మ నాన్న ల వంక చూసి నావేపు తిరిగి ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ బీ బీ ప్లస్ బీ ప్లస్ ప్లస్ సీ సీ ప్లస్ అంటూ చెప్పింది ..నాకు మతిపోయింది అదేంటమ్మ ఏ ఏప్లస్ ఏంటి అన్నా..దానికి ఆ పాప అమాయకంగా మొహం పెట్టి ఏమో అంకుల్ మా కూల్లొ అవే ఉంటాయి అంది...ఏ స్కూలమ్మ అని అడిగా...ఏమో అంది ...మీ టేచర్లు ఎవరు అని అడిగా ..ఒక సింగరాంటీ, ఒక పాటల తాత, ఒక మ్యూజిక్ అంకుల్ అంది....కాసేపటి తరువాత ఎవరో నీళ్ళు జల్లినట్టున్నారు కొంచెం కొంచెం నా కళ్ళు తెరుచుకుంతున్నాయి..అది ఒక రియాలిటీ షో మహత్యం అదిగో అక్కడ స్టేజి ధగ ధగ లాడిపోతోంది..లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి....కట్టర్లూ, థెర్మోకోల్ షీట్లు, రంగు రంగు దీపాలు చాలా హడావిడిగా ఉంది. టీలు పంచేవాళ్ళూ, టిఫిన్లందించే వాళ్ళూ, ఇలా ఎవరిపనుల్లోవాళ్ళున్నారు...అక్కడ మరో రియాలిటీ షో జరుగుతోంది..ఇంతలో అక్కడ పోటీ పడుతున్న ఒక శృంగార తార..మరో టీవీ తార మధ్యలో సడెన్‌గా గొడవ స్టార్ట్ అయింది..నువ్వు అసలు కొరియోగ్రాఫర్వేనా అని ఆడిగితే మరో ఆయన తిడుతూ మీదకెళ్ళాడు..ఒక అమ్మాయి ఏడుపు లంఘించుకుంది..జడ్జికి కంగారు కలిగింది..అందరూ ఒక్క సారిగా స్టేజిమీద కి జేరారు..నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని అరుచుకుంటున్నారు..ఎదురుగా ఆడియన్స్ మధ్యలో కూర్చున్న ఒక గర్భిణి కి ఈ జగడమంతా ఆటలో భాగమని తెలీదు చాలా టెన్షన్ పడింది..వెంటనే నొప్పులు ప్రారంభమైనాయి..డెలివరీ అయింది పండంటి మగబిడ్డ..అంతా సంతోషించారు టీవీ చరిత్రలోనే ప్రధమంగా జరిగింది అంటూ యాంఖరమ్మ అరిచి చెప్పింది..జడ్జీల ఆసీర్వాదంతో ఆ పిల్లాడికి "స్టూడియో కుమార్ " అని పేరుపెట్టలని నిర్ణయించారు....ఆ పిల్లాడి కాళ్ళు ఊపడం చూసి అప్పుడే వీడికి డాన్స్ అబ్బింది అన్నరు...కెమేరా అటు పాన్ అయింది... ఇది మరో టీవీ...ఏవో రక రకాల్ ప్రోగ్రాములు వస్తున్నాయి..మధ్యలో యాడ్స్ వస్తున్నాయి సడెంగా..ఒక డాన్స్ ప్రోగ్రాం యాడ్ వచ్చింది...ఒక డాన్సర్ని ఒక జడ్జి తిడుతున్నాడు..నువ్వు చేసింది అసలు బాగాలేదు..అసలు నువ్వు ఇక్కడిదాకా ఎలా వచ్చావా అని నాకు అర్ధం కావట్లేదు..అసలు స్టాండర్డ్ లేదు అంటూ తిడుతున్నాడు..ఆ డాన్సర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ..సెట్ అంతా నిశ్శబ్దం..యాంఖరు మఔనంగా చూస్తున్నాడు..జడ్జి తారాస్థాయిలో తిడుతున్నాడు..సడెంగా ఆ డాన్సరు కత్తి తీసుకుని ఆ జడ్జి మీదకి వెళ్ళాడు..అందరూ ఒక్క సారి ఉలిక్కి పడ్డారు...ఆ డాన్సరు పూర్తిగా జడ్జిమీదకెళ్ళాడు...అక్కడ ఫ్రీజ్ అయింది..సీను..... ఆ పార్టిసిపెంట్ ఆ జడ్జిని పొడిచి చంపాడా...లేక పొడుచుకుని చనిపోయే ప్రయత్నం చేశాడా...తప్పక చూడండి రేపటి మా కార్యక్రమంలో ...అంటూ వెనకాల నుంచి గంభీరమైన గొంతు వినిపిస్తోంది.. ఆ యాడ్ మొత్తం మీద ఒక పది ఇరవై సార్లు వచ్చింది...అందరిలో టెన్షన్ ....ఆ సమయం రానే వచ్చింది..అందరూ టీవీలకి అతుక్కుపోయారు..కానీ తొమ్మిదింటికి మొదలైన ఆకార్యక్రమంలో తొమ్మిదీ నలభై వరకూ ఆ సిట్యుయేషన్ రాలేదు కానీ ప్రతీ బ్రేకులో అదే చూపించారు..సమయం తొమ్మిదీ యాభై రెండు...జడ్జి తిట్టడం మొదలెట్టాడు..ఆ సీను మొత్తం రిపీటయింది....చివరకి...అంటే ఆఖరుకు..ప్రోగ్రాం అయిపోయే సమయానికి కత్తి తీసుకుని ఆ డాన్సరు జడ్జి మీదకి ఉరికాడు..తన చేతిలో కత్తి ఆయన కాళ్లదగ్గర పెట్టి ...సార్ ఇంకొక్క చాన్సివ్వండి నన్ను ప్రూవ్ చేసుకుంటా...ఈ సారి చెయ్యలేకపోతే ఇంక డాన్స్ చెయ్యను,,,మీరే ఈ కత్తితో నా కాళ్ళు నరికెయ్యండి..ప్రస్తుతం నేను ఈ కత్తి పాట మీద డాన్స్ చెయ్యండి అంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు..అందరూ ఊపిరి తీసుకున్నారు మీతో సహా..... ఇవన్నీ కొంచెం అతిగా నేను ఎక్కువ చేసి రాసినా..నిజానికి కొంత నిజం లేకపోలేదు..పాపం అభం శుభం తెలీని పాపాయిలని ఆడుకోవాల్సిన వయసులో ఇలాంటి పోటీ ప్రపంచంలోకి నెట్టి వాళ్ళ బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ....అసలే ఐదో క్లాసునుంచే ఐ ఐ టీ లాంటి పరీక్షలకి ట్రైనింగు స్టార్ట్ చేస్తున్న ఈ రోజుల్లో..ఐదేళ్ల వయసునుంచే ఇంత పోటీ అవసరమా....మన బలహీనతలని ఆసరా గా తీసుకుని ఎంతటి హీనానికైనా దిగజారుతున్న ఇవి రియాలిటీ షోలా...కృయాలిటీ షోలా అర్ధం కావట్లేదు...కొరియోగ్రాఫర్ తో లేచిపోయిన డాన్సరు..పేరిణి డాన్సు చూసి పూనకం తెచ్చుకున్న మరో నాట్య తార, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే రూపకాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి తెలంగాణా..రాయలసీమ అంటూ ప్రజలని రెచ్చగొట్టే కార్యక్రమలు..ఈ ప్రోగ్రాముల ద్వారా హీరోలైపోయామని కొందరు అనుకుంటే...మేము ఓడిపోయాము ఇక ఎందుకూ పనికిరాము అని డిప్రెస్ అయిపోయే వాళ్ళు కొందరు...ప్రోగ్రాములో జరిగే తంతు చూసి టెన్షన్ పడేది మనం...

Saturday, June 12, 2010

'మందు ' పాతర

 బీరు  పొంగిన జీవగడ్డ అయి
బారు  తెరచిన అభాగ్యసీమ అయి
వెలసినది  ఈ ప్రభుత్వం
ఎత్తి తాగర తమ్ముడా..!

వేలశాఖలు వెలసెనిచ్చట
ఆది వారం క్యాబరె ముచ్చట
పేకాట ఫరమరుషులకు
సాహో  అను చెల్లెలా...!

వివిధ రకముల మధ్యముల
విషము కొంచెం వొలికెనిచ్చట
తాళిబొట్టూ కరిగి పోగా
కొంప కాల్చే కొలిమి ఇచ్చట!

కూటి కోసం కూలికోసం
కొలువుకెళ్ళీ తీసుకొచ్చిన
సొమ్ముకాస్తా మురగబెట్టిన
నాటు సారా పాలు చేయర తమ్ముడా


దేశగౌరవము మంట కలవగ
దేశచరితము భ్రష్టమవగ
దీక్ష బూనిన ధీరపురుషుల
తెలిసి తాగర తమ్ముడా..!

లోకమెంతకు కేక పెట్టినా
ఆలి ఎంత గోల పెట్టిన
కుటుంబమంత వీధికెక్కిన
ఆస్తులమ్మి తెగ తాగర తమ్ముడా


మందు నదిలో మునిగిపోయే
మొగుడు జుట్టు పట్టీ గుంజకుంటే
కాపురం లో పేలి పోయే
'మందు ' పాతర చెల్లెలా..!





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, June 11, 2010

పదండి ముందుకు


 పదండి ముందుకు..పదండి తోసుకు..పోదాం పోదాం ఆఫీసుకీ..స్కూలుకీ...



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

నిరాశ - ఆశా? కాళ్ళు లేని మనిషిని చూశాక - నాకు చెప్పుల్లేవనే బాధ పోయింది.


 
కాళ్ళు లేని మనిషిని చూశాక - నాకు చెప్పుల్లేవనే బాధ పోయింది.





 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

నువ్వు

నువ్వు పక్కనుంటే ఆకాశమంత వెలుగు
నువ్వు లేకుంటే అనంతమైన దిగులు



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఓదార్పు యాత్ర

 ఓదార్పు యాత్ర

పదండి ముందుకు...పదండి తోసుకు..పదండి..పదండి..వస్తున్నాయ్ వస్తున్నాయ్ ..'జగన్నా'ధ రధ చక్రాల్ అని శ్రీ శ్రీ అంటే ఏంటో అనుకున్నా..ప్రస్తుతం మన పరిస్థితి అలానే ఉంది.ముందుకు తోసుకెళితే కానీ మనమెక్కడున్నామో అర్ధం కావట్లేదు.

అదేదో ఓదార్పు యాత్రంట. నేనింకా ప్రజల ప్రాబ్లెంస్ కనుక్కుని వాళ్ళకేమైనా సాయం చెయ్యడానికనుకున్నా..కానీ ఇది ఇంకో యాత్ర. దానికి కూడా స్వంత పార్టీ వాళ్ళు ఒక రకంగా అడ్డు పడితే మరో పార్టీ వాళ్ళు ఇంకో రకంగా అడ్డు పడ్డారు. మొత్తానికి...ఓదార్పు యాత్రకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

పప్పూ ఉప్పూ రేట్లు పెరిగిపోయాయి, గ్యాసు/పెట్రోలు అంటించకుండానే మండుతున్నాయి,
 కూరలు కొనేట్టు.తినేట్టు లేవు..
బియ్యం హాఫ్ సెంచురీకి దగ్గర్లోకొచ్చింది..
కొత్త బంగారం కూడా మ్యూజియం లోనే చూడాల్సిన పరిస్థితి..
ఎండలు మండుతున్నాయి,
,కరెంటు అప్పుడప్పుడు వస్తుంది.
.రోడ్లు..డ్రైనేజీలు మేమంతా ఒకటే..భాయి భాయి అన్నట్లు ఉన్నాయి..
టెర్రరిజం..బాంబుల భయం తో దిన దిన గండం..నూరేళ్ళాయుష్షు  బతుకు..
మంచి నీళ్ళు రావు..నేలలో బోరు నీళ్ళు లేవు
సగటు మనిషికి ఇన్ని కష్టాలుంటే మరి వీళ్లని ఓదార్చడానికి ఎవరూ రారేంటో..

ఓదార్పు ఓటర్లకేకానీ...ప్రజలకి అక్కర్లేదా.......ఓటర్లే ప్రజలు కానీ ..మిగతా వాళ్ళు కాదా..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, June 4, 2010

నా దుబాయ్ యాత్ర..

నా దుబాయ్ యాత్ర..
 
ఈ మధ్య దుబాయ్ దేశం లో ప్రదర్శన ఇవ్వడానికెళ్ళాను..ఆ విశేషంబెట్టిదనిన..

ఒకానొక శుభ సమయం లో (నాకు శుభవార్త వచ్చింది కాబట్టి), గూగులు వారి కాల్ యంత్రం (google talk)లో ఒక ఫోనొచ్చింది..ఒక తెలుగు కార్యక్రమం చేస్తున్నాం..నువ్వూ రావాలి అని..ఆహా ఏమి నాభాగ్యమూ అని పరవశించి, ఒక్క గెంతు గెంతా సీటు లోంచి..చాలా కాలం గా నా బరువు మోస్తున్న కారణంగా అణిగి ఉన్న నా కుర్చీ ఒక్క సారి మోఖం లభించే సరికి తన మీద పడతానేమో అని ఒక అంగుళం వెనకడుగేసింది..దాంతో అప్పటికే మేఘాల్లో తేలుతున్న నేను అమాంతం భూమ్మీదకి వచ్చా..(పడ్డా అనడానికి సిగ్గు పడి)..మా ఆఫీసు వాళ్ళు జాలిపడి..జారి పడ్డ నన్ను లేపి..జరిగిపోయిన కుర్చీ ని లాగి జరిగి పోయిన దాన్ని గురించి బాధ పడద్దని, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడని, నన్ను ఓదార్చి.. దుబాయ్ యాత్ర గురించి తెలుసుకుని...తమ సంతోషం వ్యక్తం చేసారు.


మరో నాల్రోజుల్లో ప్రయాణం..ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ్..ఈలోగా ఓ సహోద్యోగి..సార్ దుబాయ్ లో ఏంటి సార్ స్పెషలు..అక్కడ ఏమి దొరుకుతాయ్ అని అడిగాడు..చెప్పే వాడికి వినే వాడు లోకువ కదా అని..నాకు తెలిసిన..తెలీని విషయాలు అన్నీ చెప్పేశా. అక్కడ డేట్స్ దొరుకుతాయ్, ఎలెక్ట్రానిక్ ఐటెం బాగుంటాయ్, ఇంకా చాలా చాలా..ఆ తరువాత తెలిసింది పైన చెప్పిన సామెత అన్ని చోట్లా వర్తించదు అని..ఎందుకంటే అతనిచ్చిన షాకుకి ...


సార్ ఐతే ఒక చిన్న సాయం చేయండి సార్, అక్కణ్ణుంచి నాకో 2 కిలోలు డేట్స్ పట్రండి సార్, మా ఆవిడకి చాలా ఇష్టం..అన్నాడు..సరే..కానీ అక్కడ రక రకాల క్వాలిటీలుంటాయ్..రకరకాల రేట్లుంటాయ్ నీకే రేటు డేట్స్ కావాలన్నాను.. మీ ఇష్టం సార్ మీకేవి నచ్చితే అవి తేండి, మీరేవి తెచ్చినా నాకు ఫరవాలేదు..ఎలాగూ పార్టీ ఇవ్వాలి కదా..దాని బదులు ఇవి అంతే అంటూ తన తెలివి చూపించాడు..ఏమనాలో అర్ధం కాక ఒక వెర్రి నవ్వు నవ్వి..ఇవతలకి వచ్చేసా...అక్కడ మరొకరు రెడీ గా ఉన్నారు..సార్ అతనేమడిగాడు దుబాఇ నుంచి ఏమన్నా తెమ్మన్నాడా .. అతనెప్పుడూ అంతే సార్ ఏదో ఒకటి తెమ్మంటాడు..కానీ డబ్బులివ్వడు..మీరు ఏమీ తేకండి అతనికి..అన్నది..ఆహా ఎంత మంచి మనసు..అనుకున్నా... సార్ నేనలా కాదు సార్ నాకో ఐపాడ్ తీసుకురండి..నేను డబ్బులు ఇచ్చేస్తా..కాకపోతే..ఓ రెండు మూడు నెలల్లో అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది..


సరే అలాంటి బాలరిష్టాలన్నీ దాటుకుని,,రేపే నా ప్రయాణం అని ముస్తబౌతున్న వేళ మళ్ళీ ఫోను..దుబాయి నుంచి..ఏవండీ మీరెలాగూ వస్తున్నారు కదా..ఓ గజ మాల పట్రండి ఇక్కడ దొరకదు అని హుకుం..ఓ అలాగేనండీ అదెంత భాగ్యం అన్నా.. కానీ కొన్న తరువాత కానీ తెలీదు అది 20 కిలోల బరువుంటుందని..ఫ్లైట్ లో వాళ్ళు ఎలో చేసేది 20 కిలోలు ప్లస్ హ్యాండ్ బ్యాగేజీ..ఇక చేసేదేమీ లేక నా సరంజామా తగ్గించి..ఆ దండ..నా బట్టలు తో ఎయిర్పోర్ట్ కి బయలు దేరా. క్యాబుకి ఫోను చేస్తే..కిలో మీటర్ కి 10 రూపాయలు..వైటింగు కి 50, పార్కింగు కి 70 మీరే కట్టాలి..అని వరమందించారు..సరే తప్పదు కదాని పద మన్నాను ... తెల్లవారి ఐదింటికి బయలుదేరి...తవ్వి వదిలేసిన రోడ్డు మీద గెంతుతూ..ఎగురుతూ..పడుతూ..మొత్తానికి షమ్షాబాదు ఎయిర్పోర్టు చేరా..అదిగో అల్లదిగో..అంటూ దిగవలసిన పాయింటు కనపడుతుండగా...ఠప్....స్ స్ స్ స్ స్ స్ స్స్ అంటూ రహ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది..ఏమైందా అని చూస్తే టైరు పంచరు..సార్ అన్నాడు..ఆహా ఏమిటీ వైపరీత్యము అనుకున్నా..చిన్న బ్రిడ్జి ఎక్కితే నేను దిగవలసిన ప్లేసు..ఐనా చేయగలిగింది లేదు..ఎందుకంటే చేతిలో గజమాల..దాని బరువు బాధ్యత నాదే కాబట్టి .. కానియ్య మన్నాను. అతను పాపం వెంటనే టైరు మార్చేసాడు..గబ గబ్బా పైకి జేరి.. టికెట్ చూపించి లోనికెళ్ళా బోర్డింగు పాసు కోసం..వారు నా ముఖారవిందం చూసి..నాయన నీ పుదీనా దండని ర్యాప్ చేయించు.. అన్నారు దమ్మిడీ దానికి రూపాయి ఖర్చు అన్నట్టు..250 రూప్యములు పెట్టి కవరింగు చేయించా..దండని..ఇక బోర్డింగు పాసు పుచ్చుకుని లోనికెళ్లా స్టాంపింగు కోసం..ఎందుకెళ్తున్నావ్ అడిగాడాయన..ప్రోగ్రాముకన్నాను..ఐతే బిజినెస్ వీసా మీదెందుకెళ్తున్నావ్..అన్నాడు..నాకు వాళ్ళు అదే పంపారన్నాను..ఐతే కుదరదన్నాడు..ఎందుకన్నాను..నీకు చెప్పనుగా..వెళ్ళు వెళ్ళి అక్కడ నుంచో అన్నాడు....భయ మేసింది..ఎవరినైనా అడుగుదామంటే సిగ్గేసింది..సార్ సార్ సరిగా చూడండి..ప్లీజన్నాను..చూసా ఇక వెళ్ళు అక్కడికి అన్నాడు..వెనకనుంచీ కొందరు..భాయ్ సాబ్ జల్దీ కరో అని తిడుతున్నారు..ఏడుపొచ్చినంత పనైంది..ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..నెమ్మదిగా ఇవతలకొస్తుంటే మళ్ళీ పిలిచాడు..ఏంటన్నాను..ఇందులో రూల్స్ ఉన్నాయ్ చూసుకో అన్నాడు..పుస్తకం ఇచ్చాడు చూసా ..అర్ధం కాలేదు..అదే చెప్పాను..అక్కడి కానిస్టేబుల్ ని అడగమన్నాడు.. అతను చెప్పాడు పేజి తెరిచి అందులో ఏమైనా పెట్టమన్నాడు..అప్పుడర్ధమైంది.. గాంధీ గారితో రికమెండ్ చేయించా..ఆయన ముఖం చూసి వదిలేస్తున్నా అన్నట్టు ముఖం పెట్టి పళ్ళికిలించి స్టాంపేశాడు...వెంటనే రిపోర్టిద్దామనుకున్నా. కాని ఫ్లైట్ ఎక్కే హడావిడి లో ఉన్నా..అందుకే వదిలేసా..


గబ గబా ఫ్లైట్ ఉన్న వైపు పరిగెత్తా..సినిమాల్లో విమాన ప్రయాణాలని,,,అందమైన ఎయిర్ హోస్టెస్ లని గుర్తు తెచ్చుకుంటూ..పరిగెత్తుకు వెళ్ళి విమానం తలుపు దగ్గర కెళ్ళా..మన ఇళ్ళల్లో పెళ్ళిలైనప్పుడు వాకిట్లో ఎదురొచ్చే పండు ముత్తైదువ చేతిలో హారతి పళ్లెం లేకుండా నవ్వుతూ స్వాగతం అన్నది.. కలయా నిజమా ... తొలి సారి విమాన ప్రభావమా అని ఒక పాట వెనకనించి వినిపిన్స్తుండగా..నా బోర్డింగు పాసు చూపించి లోనికెళ్ళా.. అటు వైపు తిరిగి మరెవరికో సీటు చూపిస్తున్న మరో ఎయిర్ హోస్టెస్ కనిపించింది..పోనీలే కాస్త నయం అనుకున్నా..అతనికి సీటు చూపించి ఇటు తిరిగాక అర్ధమయింది..ఈవిడ..ఇటు మా బామ్మ తరపు చుట్టమని...నాకు తెలిసి..వీళ్ళిద్దరూ..విమానం దిగగానే రిటైరవుతారేమో బహుశా.. అరవై కి అర రోజు దూరం లో ఉన్న ఆ వనితల చిరు నవ్వు చిరాకెత్తించి..బయటకి చూశా ..విశాలంగా పరుచుకున్న రెక్కలు కనిపించాయి.. ఆహా ఏమి భాగ్యము అనుకున్నా.. ఈలోగా పేపర్ చిరిగి పోయిన స్పీకర్ లోంచి గర గరమంటూ ఒక ఖంటం వినిపించింది..అదేంటో అర్ధం అయ్యే లోపల మరో కంఠం సీట్ బెల్టు పెట్టుకోమని అరిచింది..మా ముందు..ఆ ఎయిర్ హోస్టెస్ లు ఆదివారం మూగ వార్తలు చదివే వాళ్ల లాగా ఏవో సైగలు చేసారు... ఆ తరువాత ఏవో కాగితాలు పంచారు..బస్సుల్లో రైళ్ళలో పంచి, డబ్బులడిగినట్టు ఇక్కడ కూడ అనుకుని వెంటనే లేచా జేబులోంచి ఏమైనా తీద్దామని..కానీ ఈలోగా విమానం బయలుదేరడంతో కూర్చుండిపోయి ఆ కాగితాలు చూసా అవి ఇమ్మిగ్రేషన్ కాగితాలు.సరే లే అని సరిపెట్టుకుని కూచున్నా..ఈలోగా ఓ తోపుడు బండి తో వచ్చారు ఆ వృద్ధ కన్యలు...ఏమిటన్నా...బీరా విస్కీ నా అన్నారు.. నాకర్ధం కాలేదు..పొద్దున్నే ఆరింటికి ఇదేమిటి అనుకున్నా.. నా పక్కన ఉన్నవాళ్ళు మాత్రం నన్ను ఏదో ఒక వింత లోకం నుంచి వచ్చిన అవతారం లా చికాగ్గా చూసి వారి వారి బ్రాండ్ లు పుచ్చుకున్నారు..ఆహా స్వర్గానికి దగ్గరగా ఆకాశంలో ఉండడం వల్ల కాబోలు..ఇలా అప్సరసలు...అమృతం అందిస్తారు అనుకున్నా..ఇంకోరకంగా ఆలోచిస్తే భయం పోవడానికి మందు గా ఉపయోగపడుతుందికదా అనిపించింది..ఈలోగా మళ్ళా అప్సరసలు..తినడానికి ఏవో తెచ్చారు..వెజ్జా నాన్ వెజ్జా అన్నారు ..వెజ్ అన్నా..ఒక ప్లేటు ఇచ్చారు..ఒక బన్ను..వెన్న..ఒక వెండి పాత్రలో(తగరపు బొచ్చె అనలేక) బిరియాని..కూర..పప్పు..తెల్లవారుఝామున ఆ ఆహారం ఎలా తినాలో అర్ధం కాక ఆ బన్నుని వెన్నలో ముంచుకు తినేసి..ఇన్ని కాఫీ నీళ్ళు తాగి హమ్మయ్య అనుకున్నా...గ్ర్ గ్ర్ గ్ర్ర్ర్ర్ అని శబ్దం తో మొత్తానికి నాలుగు గంటల ప్రయాణం తరువాత దుబాయ్ విమానాల స్టేషన్ లో దిగాను. మల్లీస్వరి సినిమాలో వెంకటేసు లాగా చాలా దూరం నడిచి నా సామాను తీసుకుని బిక్కు బిక్కు మంటూ ముందుకు కదిలాను..ఎక్కడ చూసినా తెల్ల నైటీలు వేసుకున్న మగవాళ్ళు..నల్ల బురఖా వేసుకున్న ఆడవాళ్ళు..అలా చూసుకుంటూ బయటకొచ్చేసరికి నన్ను పిలిచిన మహానుభావులు..దేవుళ్లలా కనిపించారు..మళ్ళీ హమ్మయ్య అనుకుని వాళ్ల కారు లో ఎక్కి హోటేలుకొచ్చా..పెద్ద హోటలే..రూములో దించాక..ఇంక మీరు ఫ్రెష్ అయి కాస్త రిలాక్సవండి సార్..మధ్యాన్నం అన్నం టైముకొస్తాం..కింద కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది..తినేసి రూం లో రెస్ట్ తీసుకోండి అంటూ హడావిడిగా..వెళ్లిపోయారు..


సరే అని కాస్త ఫ్రెష్ అయి కిందకి వెళ్లా..అక్కడా ఒక నైటీ అబ్బాయి ఒంటె అంత ఎత్తున్నాడు..స్వాగతం పలికాడు..ఆ భీమ సేనుడి నుంచి దూరంగా జరిగి..ఫుడ్డు దగ్గరకొచ్చా..బఫే భోజనం లా అన్నీ అక్కడ ఉన్నాయి మనమే వడ్డించుకోవాలి.. సరే అని వెళ్ళి ఒక్కో మూతా తీసా..ఒంటె కొవ్వుతో చేసిన..ఒక తినుబండారం, చికెన్ కట్లెట్, మటన్ బుల్లెట్టు, వాడి తద్దినం టాబ్లెట్టు.ఏవేవో ఉన్నాయి..ఒక్కటీ మానవాహారం కనపడలేదు.. నెమ్మదిగా వెళ్ళి ఆ భీమ సేనుణ్ణి అడిగా.. is there any thing veg అని..వాడు నన్ను వింత గా చూసి..what అన్నాడు. వెజ్ వెజ్ ఫుడ్..వెజ్ అన్న్నా..వాడు నన్ను చూసి ఒహ్ ఊ మీన్ వెజ్..కమాన్ అని తీసుకెళ్లి కోడి గుడ్డు చూపించాడు..నీ బొంద ఇది నేను తినను అన్నా..వాడికి అర్ధం కాకపోవడం వల్ల బతికి పోయా లేకపోతే మధ్యాన్నానికి లంచ్ కి నన్ను వండేవాళ్లేమో. మరో మూత తీస్తే హైదరాబాద్ సమోసా కనిపించి ప్రాణం లేచొచ్చింది..హమ్మయ్యా అనుకుని అది తీసుకోవడానికి..ప్రయత్నిస్తుంటే ...That is kheema samosa అన్నాడు మా భీమ సేనుడు.. వెంటనే కడుపులో తిప్పి ఒక్క సారి షాక్ కొట్టినట్టు దానికి దూరంగా జరిగా..ఇక అక్కడ నాలాటి వాళ్ళు తినేది ఏది లేదని తెలిసి మళ్ళి బన్ను ని వెన్నలో ముంచుకు తిని..కార్న్ ఫ్లేక్స్ ని ఆవు పాలలో కలుపుకుని తిని..రూముకొచ్చి తెలుగు సంఘం వాళ్ల కోసం ఎదురుచూస్తూ నిద్ర పోయా..

ఇంత లో బెల్లు మోగింది..సారీ అండీ మధ్యాన్నం పని వత్తిడి వల్ల రాలేకపోయాం..రేపు శలవు కదా కొంచెం వర్క్ కంప్లీట్ అయ్యే సరికి లేట్ అయింది..రండి డిన్నర్ కి వెళదాం అనే వరకు..అక్కడ రాత్రి అయిందని..నేనేమీ తినలేదనీ గుర్తు రాలేదు..అంటే అంతసేపు పడుకున్నానన్నమాట.. బన్నుకి వెన్నకి థాంక్స్ చెప్పుకుని వాళ్లతో వెళ్ళి మన ఆంధ్ర హోటల్ లో తిని..బయటకొచ్చేసాం. మరునాడు ప్రోగ్రాము చేసుకుని మళ్ళీ ఇండియా బాట పట్టా...విమానం ఎక్కుతూనే అప్సరసలకోసం వెతికా...వీళ్ళు వేరే వాళ్ళు..అవును అన్నట్టు మర్చిపోయా..వాళ్లు నిన్న రిటైరైపోయుంటారు గా... వీళ్ళకి రేపు రిటైర్మెంటు..
 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
 courtesy :
http://sujanaranjani.siliconandhra.org 

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates