Wednesday, January 28, 2009

ఊళ్లో పెళ్ళికి......

ఊళ్లో పెళ్ళికి

ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, అని ఒకప్పటి సామెత. అలానే జరిగింది నిన్నటి విషయం. పవన్ కళ్యాణం గురించి హడావిడి చేసిన మీడియాని చూస్తుంటే విసుగేసింది. అదేదో మూడో పెళ్ళన్నట్టు, లేకపోతే ఫస్త్ టైం జరుగుతున్నట్టు హెడ్డింగులెట్టి హడావిడి చేసి కంఫ్యూజ్ చేసారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు సమక్సంలో జరిగిన పెళ్ళికి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు వెళ్ళి ఏమీ దొరకక ఎక్కడినుంచో కవర్ చేసి మాదే స్పెషల్ కవరేజి అన్నట్టు చెప్పి నానా హడావిడి చేసారు.. ఆయన అంతకు ముందునుంచే ఆవిడతో సహజీవనం చేస్తున్నా అని ఎప్పుడో ప్రకటించారు. అంతకుముందావిడతో విడాకులయ్యక ఇప్పుడు వీలు చూసుకుని పెళ్ళి చేసుకున్నాడు.

మొన్నామధ్యా అంతే బాలయ్య కూతురికి..చంద్రబాబు కొడుక్కీ పెళ్ళైతే ఇంటిముందు కెమెరా పెట్టుకుని లోపలకి వెళ్ళే వాళ్ళని..వచ్చేవాళ్ళని చూపిస్తూ వాళ్ళకి తోచిన స్టోరీలలారు. ఎన్ టీ ఆర్ కి అవమానమైందని అందుకే వెళ్ళిపోయాడని..ఇంకెవరో రాలేదని దానికి కారణాలు ఇవి అని..ఇక వాళ్ళిష్టం...

మోహన్ బాంAlign Centerబు ఇంటి విషయం లో కూడా అలానే తలదూర్చి తల వాచేలా తిట్లు తిన్నారు. ఎంత సెలెబ్రిటీలైతే మాత్రం వాళ్ళకి ప్రైవేటు జీవితాలుండవా. వాళ్ళ ప్రతీ విషయం ప్రజలముందుంచాలా ? చూపించడం తప్పో కాదో కానీ..తోచిన కధనాలు అల్లడం..నచ్చిన హెడ్ లైన్లు పెట్టడం ... వీలైనన్ని సార్లు చూపడం రోత..

న్యూసెన్సె టీ వీ లు ఎప్పటికి బాగుపడతాయో ?

Saturday, January 24, 2009

బైపాస్...

బైపాస్...

ఇవాళ్టి ఈనాడులో బైపాస్ గురించిన్ చదివా.....ఇప్పటికి ఎంతోమందికి బైపాస్లు అయినా ప్రస్తుతం అప్రధాన మంత్రికి జరుగుతోంది కాబట్టి బాగానే వివరాలిచ్చారు..ఎలా ఆపరేషను చేస్తారు.....ఏమి జరగొచ్చు అని...పోనీలే ఈ పుణ్యాన బైపాస్ గురించి చాలా విషయాలు తెలిసాయి....అసలే ఇప్పటి గవర్నమెంటుకి ఇది ఆఖరు సంవత్సరం....మళ్ళీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారో ప్రజలు...తెలిసేదాకా టెన్షను...ఇక ఇట్లాంటి సమయంలో ఏ ఒక్క విషయాన్నీ వదిలిపెట్టట్లేదు..ఎవరూ.....

సోనియా ప్రధాని కాకుండా చాలామంది 'బైపాస్ ' చెయ్యడం వల్ల ప్రధాని అయిన మన్మోహనుడు మడం వాహనుడు..... ఆ ప్రధాన పదవికి న్యాయం చెయ్యడానికి ఎంతో కష్టపడి...అందరినీ మెప్పించడానికి (అటు మేడం ని, ఇటు పార్టీ వాళ్ళనీ, అటు మద్దతు దారుల్నీ...) చివరకి గుండెలమీదకి తెచ్చుకున్నాడు...పాపం ప్రధాని కాబోయి ఆగిపోయిన త్యాగమూర్తి సోనియా ఆదేశాల మేరకు..ఆ పదవి బైపాస్ అయి ఎవరికో వెళ్ళకుండా స్టెంటు లా ఉప యోగ పడ్డాడు..ఎందుకంటే ఆయనకి దక్కింది నిజంగా ప్రధాని యోగం కాదు 'ఉప ' యోగమే...

ప్రణబ్ లాంటి వాళ్ళు తెరమీదకొస్తే "రాహుల్ " మార్గానికి అడ్డొస్తుందని ఈ అమాయక ఆర్ధిక మంత్రిని...ఆపద్ధర్మ ప్రధాన మంత్రిని చేసారు..ఎంత కాకపోతే ప్రధాని ఉండగా సోనియా ప్రభుత్వ కార్యక్రామాలు ప్రారంభోత్సవం చేస్తారు.?

రాహుల్ ప్రధాని కావడానికి ఒప్పుకోకపోతే....ప్రియాంక ఉండనే ఉంది...ఆమీ కాదంటే ఆమె పిల్లలైనా సరే మనకి గాంధీ/నెహ్రూ కుటుంబానికి చెందినవాళ్ళైతే చాలు...ఎవరైనా సరే....ఎలా అయినా సరే.....సెంటిమెంటుతో కొట్టేస్తా.........ప్రధానమంత్రి సీటు....

పాపం కొంతమంది అమాయకులు అయ్యో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి లేకపోతే ఎలా అనుకుంటున్నారు.......బాబులారా..అమ్మలారా కంగారు పడకండి....అమ్మ దయ వుంటే హస్తినాపురంలో ఉన్నా ...హాస్పిటల్లో ఉన్నా...పార్లమెంటులో ఉన్నా....పంజాబ్లో ఉన్నా అంతా అమ్మే చూసుంటుంది...మనం నిమిత్తమాత్రులం..

Thursday, January 22, 2009

రాజ(సూ)కీయ యాగం

రాజకీయ యాగం
ఆమధ్య యాగం/హోమం గురించి రాస్తే అంతటి పవిత్రమైన వాటితో పోల్చద్దని నాకు హితవు చెప్పారు...అది వాటితో పోల్చడం కాదు...కనీసం ఇలా ఐనా పవిత్రమైన వాటిని తలుచుకోవడం మాత్రమే....._

అప్పట్లో ధర్మ రాజు..రాజసూయం చేసాట్ట....దేశాలన్ని గెలిచినందుకు..ఇప్పుడూ తె రాస రాజు కూడా అలాంటిదే చేపట్టాడు దానిపేరే రాజకీయ యాగం....మొన్నటిదాకా సోనియా ... వై ఎస్ ల తో కలిసి వస్తుందనుకుని....తెలంగాణా వచ్చేస్తోందని..అనుకుని ..ఇప్పుడు వాల్లు తేల్చట్లేదు కాబట్టి ...సడెంగా వై ఎస్ చెయ్యి వదిలి..సైకిలెక్కి రెండురోజులు గడవక ముందే...గట్టు చూసుకుని దిగిపోయాడు.....

ఆ యాగాల్లో ఏమి వాడేవారో ఎవరిని బలి ఇచ్చేవారో తెలీదు కానీ...ఈ యాగాల్లో మాత్రం పాపం ప్రజలు సమిధలౌతున్నారు..కులం, మతం అనే ఆజ్యం పోస్తూ....అమాయక కార్యకర్తలను బలి ఇస్తున్నారు.....వాగ్దానాల మంత్రాలు వల్లిస్తూ (దెయ్యాలు మంత్రాలు వల్లించడమంటే ఇదేనేమో?) పదవుల కోసం పరితపిస్తున్నారు...
అక్కడ ద్రౌపది నవ్విందని రారాజుకు కోపం వచ్చి కురుక్షేత్రమైంది....ఇక్కడ శిఖండిలే తప్ప ద్రౌపదిలు లేకపోయినా యుద్ధం మాత్రం జరుగుతుంది...కాకపోతే మయ సభలో అర్ధంకాక తిరిగేది మాత్రం ప్రజలే....

ఐదూళ్ళిచ్చినా చాలు అని ధర్మ రాజు కోరితే ఇన్ని ఎమ్మెల్యే సీట్లూ...ఇన్ని ఎం పీ సీట్లూ ఇమ్మని ఇక్కడ బేరం పెడుతున్నారు...ఇవ్వకపోతే ఎవరికి వారే యమునా తీరే...వ్యవహారం...ఈ కొట్లటలు....విడిపోవడాలు తమకే లాభం కాబట్టి 'చేతులు' కట్టుకు చూస్తున్నాడు
'రాజీవ (ఆ)లోచనుడు "




అమెరికా- భూతాల స్వర్గం..

అమెరికా భూతాల స్వర్గం..

ఒకప్పుడు భూతల స్వర్గం అనుకునే అమెరికా ఇప్పుడు భూతాల స్వర్గంగా మారింది..ఆ సాలరీలపై ఎన్నో ఆశలతో అమ్మ తాళిని(అదీ డాలరే) అమ్మి డాలర్లని నమ్మి వెళుతున్న వారు ఎంతమంది సుఖ పడుతున్నారో నాకైతే తెలీదు కానీ..ఆర్ధికసంక్షోభం వల్ల ఉన్న ఉద్యోగం ఊడి ఎక్కడైనా ఏదైనా ఊడిగం చెయ్యాల్సిన పరిస్థితులు వినిపిస్తున్నాయి...
డొనేషన్లు పోసి ఇంజినీరింగు చదివి పై చదువులకోసం అమెరికా చేరీ పైలోకాలు చేరుతున్న అమాయకుల కధలు వింటుంటే..జాలీ బాధా భయమూ కోపమూ అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి...
తెలుగు వారంతా ఒకటే అని పైకి చెబుతున్నా కులాలూ..ప్రాంతాల వారీగా విడిపోయి..పోటీపడిపోయి..తాన తందాన ఆటలూ..పాటలు నిర్వహించే వారంతా ఒక్కటై ఉంటే ఎంత బాగుంటుంది...
ఎబ్రాడ్ మైండు తో ఆలోచించే పిల్లలూ...డాలర్ల కోసం డేంజర్లో పడకండి...డార్లింగుల వలలో పడకండి....మన భారతాన్ని అమెరికాని చెయ్యండి..అంటే అమెరికాలా భూతాల స్వర్గం చెయ్యమని కాదు...
మన మేధా సంపత్తిని పరాయి దేశం పాలు చెయ్యకండి...మన మేధోవలస ఇంగ్లీషులో 'బ్రైన్ డ్రైన్' అంతా అక్కడకి వెళుతోంది...మన యువత ధీ శక్తి మన దేశంలోనే ఉంటే మనమే అమెరికా కన్నా గొప్పవాళ్ళమౌతామని..హరగోవిందులు..కల్పనా చావ్లాలూ,,,మన వాళ్ళే కదా....మన జీవ కణాల్లో ఉన్న ఆ బుద్ధికుశలత మనకి ఉపయోగపడట్లేదే అని నా బాధ...మన పసుపు ..వేప కూడా వాళ్ళ పేటెంటులో చేరిపోతుంటే మన కి బాధే కదా ? భారతీయ కధల్లో..ఆయుర్వేదంలో..వేదాల్లో సారం వాళ్ళు జుర్రేసుకుని చీకేసిన టెంకలని..మన మీదే విసురుతున్నారు...ఇది ఎంతవరకు సహ్యం....బాగున్నంత కాలం మన సేవలు...మన తెలివితేటలూ కావాలి..ఇవ్వాళ ఆర్ధిక సంక్షోభం వచ్చిన రోజున నిన్నటిదాకా పరువు కాపాడిన మనం బరువౌతున్నాం....అక్కడ చదువుతూ పెట్రోలు బంకుల్లోనూ..సూపర్ మార్కెట్లోనూ పనిచెయ్యడానికి పడని సిగ్గు అమ్మకి నాలుగు కరివేప రెబ్బలు తేవడానికి ఎందుకు...అమ్మ చేతి ం వంట తింటూ..నాన్న కళ్ళముందు తిరుగుతూ..మన అక్క చెల్లెళ్ళు,,అన్న దమ్ములు..మన స్నేహితులూ..మధ్య హాయిగా తిరుగుతూ మన తాలెంటు ఇక్కడ నిరూపించుకుంటే చాలదా...
మేరా భారత్ మహాన్

Sunday, January 18, 2009

ఫిట్టింగ్ మాస్టర్స్

ఫిట్టింగ్ మాస్టర్స్
ప్రపంచంలో చాలా మంది ఫిట్టింగ్ మాస్టర్స్ ఉన్నారు...

ఇప్పుడు రాజకీయాలు సినిమాలు స్పోర్ట్స్ వకటనేమిటి ఎందులో చూసినా ఫిట్టింగ్ మాస్టర్స్ ఉన్నారు ఉంటారు.. పాపం మనం నారదుణ్ణి ఫిట్టింగ్ మాస్టర్ అంటాం కానీ ఆయన లోక కళ్యాణానికే ఫిట్టింగులు పెడతాడు కానీ ఆయనకి వాటితో పనీ లేదు..లాభమూ లేదు..ఆయనకి కళ్యాణమూ..సంసారమూ లేవు కాబట్టి....లోక కళ్యాణమే ఆయన ధ్యేయం...

ఈ మధ్య క్రికెట్ చూడండి కంగారూలు చేసే కంగాళీ అంతా ఇంతా కాదు...ఆట గెలవడానికి దేనికీ వెనకాడరు..ఏదో ఒక విషయంలో ఫిట్టింగు పెడుతూనే ఉంటారు..ఆ మధ్య మురళీధరన్ బౌలింగు ఆడలేక యాక్షన్ వోడు అన్నారు..తరువాత మన హర్భజన్ కి ఫిట్టింగ్ పెట్టారు..ఈ మధ్య ఐ సీ సీ కూడా మహా టీం లో సచిన్ పేరు పెట్టకుండా ఫిట్టింగెట్టి అందరితో అక్షింతలు వేయించుకున్నారు...కుంటున్నారు...

ఐటీ రంగంలో...సత్యం రాజు పెట్టిన ఫిట్టింగు దెబ్బకి షేరులు కూలి....ఉద్యోగాలు ఊడి...అమెరికా లెవల్లో పరువు పోయి మొత్తం భారతం ఒక్క సారి ఉలిక్కిపడింది...

ఇక రాజకీయాల్లో ఫిట్టింగులకి కొదవే లేదు...రాష్ట్రం ఇస్తాం అనీ,,,,ఇవ్వం అనీ....ఇవ్వలేం అనీ,,జిల్లాలో ఒకళ్ళు...హైద్రాబాదులో ఒకళ్లు...డిల్లీలో ఒకళ్ళు ఫిట్టింగు పెడుతున్నారు...ఇక ఏ పార్టీలో ఎవరు జేరుతున్నారో ఎవరు ఏ పార్టీ వాళ్లు ఎవరితో ఎందుకు పొత్తులు పెట్టుకుంటారో అసలు ఆ ఫిట్టింగేమిటో ఎన్నికల దాకా ఒక్కోసారి ఆ తరువాత కూడా అర్ధం కాదు..అసలు తెలంగాణా గురించి తేల్చలేదని..బయటకొచ్చిన కే సీ ఆర్ ... ఇప్పుడు అదే పార్టీ తో కలిసి పనిచేస్తామండం ఏమి ఫిట్టింగో....నిన్నటిదాకా ఇస్తామన్న కాంగ్రెస్స్ ఇప్పుడు అసలు మాట ఎందుకు మారుస్తున్నారో తెలీదు....కే సీ ఆర్ ని దుమ్మెత్తి పోసిన తల్లి తెలంగాణా ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తారో...ఏమిటో ఈ రాజకీయపు ఫిట్టింగు....

ఇలా చెప్పుకుంటూ పోతుంటే నాది సుధీర్గ ఫిట్టింగు....

నారాయణ నారాయణ ఇందులో ఏమీ ఫిట్టింగు లేదు 'నారా'యణ అనుకుంటారేమో నిజంగా నారాయణ అంటే ఆ నారాయణుడే..

Thursday, January 15, 2009

పోలింగు బూతు

పోలింగు బూతు

అవడానికి అది ఇంగ్లీషు బూతైనా ప్రస్తుతం ఆంధ్రాలో పోలింగు సందర్భంగా బూతు లెక్కువైనాయి..
పంచెలూడగొట్టడాలు..గురించి పంచ్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన కళ్యాణాల గురించి మరొకరు మాట్లాడుతున్నారు.. తిరుపతిలో పరపతి చూపించాక ప్రజా అంకిత సభలు చేపట్టిన మెగా నాయకుడికి త్వరగానే రాజకీయ పరి భాష వంటబట్టింది...ఇక 'చెయ్యి ' జేసుకునే కన్నా నోరు చేసుకోవడం బెటరు అనుకుని నోరుపారేసుకుంటున్నారు కొందరు నాయకులు...రోజాకు ముళ్ళుంటాయి అని నిరూపిస్తున్నది మరో పక్క పసుపుపచ్చ రోజా.....

రోడ్ షోలు బంద్ అంటూ కోర్టు ఉత్తర్వు ఇస్తే....పేరు మార్చి ఏమార్చి సభలు నిర్వహిస్తున్నారు సదరు నాయకులు...అసలు ఈ సభలకి,,,రోడ్ షోలకి ఉపయోగించే జెండా గుడ్డలు పేదలకిస్తే ఈ చ(క)లి కాలం పాపం వాళ్ళు వళ్ళు కప్పుకుంటారు......
ప్రాంతాల వారీగా....కులాల వారీగా...విడగొట్టి....తొడగొట్టి....అరవడానికి ఇది సినిమా కాదు...రాజకీయం........ప్రజా సేవ కోసం పాటు పడదామనుకునే మెగాస్టారు..ఒక్క మగా(డు)స్టారు, మహా సారు...లాంటి వాళ్ళంతా నీతులు...బూతులు వల్లించడం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం ఏమి చెయ్యాలో ఆలోచిస్తే బాగుంటుందేమో ?

Friday, January 9, 2009

పండగ చేసుకోండి...

పండగ చేసుకోండి...
అవును ఎంచక్కా పండగ చేసుకోవచ్చు...లారీ (చార్జ్)సమ్మె వల్ల "తేల్" ఖతం అయి ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. పండగ పనులన్నీ తొందరగా పూర్తిచేస్కుని శలవులు ఎంజాయ్ చేద్దామంటే పెట్రోలు దొరక అసలు ఆఫీసు కి వెళ్ళడమే డౌటుగా మారింది..
సత్యాసత్యాల విషయం దేవుడెరుగు అసలు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని తెలీక సాఫ్ట్ వేరు ప్రాణాలు గాల్లో దీపం లా మిణుకు మిణుకు మంటున్నాయి..షేర్ల లో పెట్టిన డబ్బు నీరులో పోసినట్టే అని తెల్సి కొన్ని షేరు జీవాలు ఇప్పటికే ఊసురో మంటున్నాయి..
నిత్యావసర వస్తువులు 'వందకి 'దొరుకుతాయో లేదో తెలీదు కానీ షాపులు బందు కాకుండా ..రేట్లు పెరగకుండా చూస్తే చాలు.
.పతంగులు కోసం ఆకాశం వంక చూస్తే అక్కడ బియ్యం పప్పు ధరలు కనిపిస్తున్నాయి.
రాజకీయ సమీకరణాలు..పార్టీల పొత్తులు పల్లెటూరి గుడిముందు మెలిక ముగ్గులా అందంగా కనిపించినా కంఫ్యూజన్ కలిగిస్తున్నాయి..
రాజకీయం రంగుల ముగ్గులా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నా గొబ్బెమ్మల ప్లేసులో పేడ కనిపిస్తోంది...
ఎటైనా వెళదామంటే బస్సులు రేట్లు పెంచి పండగ ఆఫర్ అందిస్తున్నారు అటు ఆర్ టీ సీ ఇటు ప్రైవేటు ఆప"రేటర్లు "
పోనీ లోకల్ గా వెళదామంటే ఎక్కడ బాంబులెట్టారో.ఎక్కడ ఏమి జరుగుతుందో అని టెన్షన్.. సిన్మాకెళదామంటే బుకింగు ఓపెన్ చెయ్యకుండానే బ్లాకులో అమ్ముతూ బాక్సాఫీసు కుమ్ముతున్నారు సినిమా ధియేటర్ల వాళ్ళు..
ఇక టీవీల్లో సరే సరి రియాల్టీ షోలపేరుతో పసిపిల్ల తో చేసే క్రుయాలిటీ షోలు చూస్తుంటే టేవే లో వాళ్ళ బుర్ర బద్దలుకొట్టాలనిపిస్తుంది..
వాళ్ల మీద కూడా మైనర్ బాల కి సంబంధించిన శిక్షో ? బాల కార్మికుల(బాల కళాకారుల) కు సమంధించిన శిక్షో వేస్తే బాగుణ్ణు అనిపిస్తుంది..
ఏది ఎలా ఉన్న రాజకీయ నాయకుల వాగ్దానాల్లా, తెలుగు సినిమా హీరో ఫ్లాపుమూవీ లా, టీవీ సీరియల్లో కోడలికష్టం లా అన్నీ మర్చిఓయి
భోగి మంటలు, సంక్రాంతికొచ్చిన కొత్త పంటలు కనుమ రోజు కమ్మని వంటలు తో పండగ చేసుకోండిసంక్రాంతి శుభకాంక్షలతో మీ

Thursday, January 8, 2009

'సత్య ' మేవ భయతే

'సత్య ' మేవ భయతే
ఒకప్పుడు సత్యమేవ జయతే అని చదూకున్నా..సత్యమే గెలుస్తుంది అనుకున్నా. కానీ ఈ రోజు సత్యం పేరు తలుచుకుంటే భయమేస్తోంది. మూడు సిమ్హాల కింద సత్యమేవ జయతే చూసిన కళ్ళతో ఐటీ ఇంఫ్రాస్ట్రక్చర్ షేర్లు అనే సిమ్హాలు(షేర్లు) కింద సత్యమేవ 'భయతే' అని కనిపిస్తోంది....అచ్చం సినిమాల్లోలా...సినిమాలలాగా ఆడక పోయినా ఆడుతున్నట్టు, హౌస్ ఫుల్ కలెక్షన్లు అని, వందరోజులు ఆడిఒంచినట్టు, రెండో రోజు నుంచే సక్సెస్ మీట్లు, విజయోత్సవాలు అన్నట్టు, జిల్లాల వారీగా కలెక్షన్లు చూపించినట్టు అబ్బో బ్రహ్మాండంగా ఉంది మన దగ్గర అని 'సత్యం ' చెప్పిన మాటలు విని సత్యమే అనుకున్నారు .. ఏది ఏమైనా ఐటీ రంగంలో కొంత కాలమైనా మన పేరు మారుమ్రోగింది అన్నది మాత్రం 'సత్యం ' . పాపం ఆ పేరు నిలబెట్టుకోవడానికి పడిన తాపత్రయంలో చాలా లోతుకి పడిపోయాడు..
సత్యం సంపాదించిన పేరు..లాభాలు ..రికార్డులు..చరిత్ర తిరగరాస్తుందని సత్యం(SATYAM) తిరగేసి రాసిన మేటాస్ (MAYTAS) కూడా ఆదుకోలేక పోవడంతో షేర్లు పడిపోయి అద్రుష్టం ఆడుకుంది..(నాకు షేర్ల గురించి అంతగా తెలీదు కానీ లాభాల్లో ఉంటేనే కొంటారని విన్నా)
రాజు తలుచుకుంటే 'దిబ్బల ' కి కొదవా?
ఆధిపత్యం పైత్యంలో అ(ర్ధ)సత్యం వల్ల, ఆర్ధిక విషయంలో అర్ధం పర్ధం లేని లావా దేవీల వల్ల సత్యమేదో..కానిదేదో తెలీక సాఫ్ట్ ' వేర్లు ' దగ్గర్నుంచీ, షేర్లు వరకూ కుదేలై జనాలు గగ్గోలు పెడుతున్నారు కాంట్రాక్టు ఇస్తే కొన్నాళ్ళలో మేమే ఎదురు డబ్బిస్తాం అనే రేంజి లో చెప్పే వాళ్ళని ఎలా నమ్ముతారో ఏమిటో..ఇక ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం మీద విరుచుకు పడే 'ప్రతీ' పక్షం వాళ్ళు , అసలు ఆయనని 'వెలుగు ' లోకి తెచ్చింది పాత ప్రభుత్వమే అని పాలక పక్షం వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడమే కానీ ప్రజల పాట్లు పట్టించుకోరు.....

Sunday, January 4, 2009

రంగు పడుద్ది

రంగు పడుద్ది

ఎస్ నిజంగా రంగు పడుద్ది..కలర్స్ ఆఫ్ పాలిటిక్స్ చూస్తే మనకు రంగు పడుద్ది..

సపోస్ పర్ సపోస్ ప్రజారాజ్యం + బీజేపీ ఏమౌతుంది..కాంగ్రెస్స్ అవుతుంది..ఎలా అనుకుంటున్నారా? తెలుపు ఆకుపాచ్చ జెండాకి కాషాయం కలిస్తే కాంగ్రెస్స్ జెండా అవుతుంది కదా...

పసుపు లోంచి విడిపోయి పింక్ అయిపోయిన తెరాస ఇప్పుడు మళ్ళీ తెలంగాణా కోసం పింక్ కారుకి పసుపుతో కోటింగు కు సిద్ధం అని ఆమధ్య ప్రకటించారు..అఫ్ కోర్స్ అదీ ఎన్నాళ్ళో? నచ్చకపోతే మారొచ్చు కూడా...

తెలుపు ఆకుపచ్చల కు నీలం తోడై "ప్రజానవతెలంగాణరాజ్యం " సాధిద్దాం అనికూడా ఒక నినాదం నిదానంగా వినిపిస్తోంది...

ఇక ఈమధ్య ఆల్రెడీ పసుపు ఎరుపు కలిసి మూడో కూటమి కి మేము సైతం అంటున్నారు..సైకిల్ పై కత్తి కొడవలి స్వారీ అన్నమాట..పసుపు ఎరుపు కలిస్తే ఏం రంగు వస్తుందబ్బా...


ఈ కలర్స్ కాంబినేషన్ చూస్తుంటే కొంచెం కంఫ్యూజన్ గానే వుంది..అప్పట్లో అంటే చంద్రబాబు సీ ఎం గా ఉన్నప్పుడు ఆయన "పచ్చదనం-పరిశుభ్రత " అంటే అపార్ధం చేసుకున్న కార్యకర్తలు రాష్ట్రమంతా పసుపుమయం చేసారు పచ్చ అంటే పసుపు కాబోలు అనుకుని...కొందరు ఇంటికి వంటికి కూడా పూసుకుని తమ పార్టీ భక్తి కూడా చాటారు..అందుకే త్వరగా ఈ పార్టీలు రంగులు ఖరారు చేస్తే కార్యకర్తలు గోడలు ఖరాబు చెయ్యడానికి తయారు అవుతారు...

వాళ్ళ వాగ్దానాలకి కళ్ళు బైర్లు కమ్మి మనకి ఎలాగూ కలర్ బ్లైండ్ నెస్స్ వచ్చి మనం ఏది ఏ కలరో ..ఏకలర్ పార్టీ వాళ్ళు ఏపార్టీ తో జతకట్టేరోఅ గుర్తు పట్టలేము.. ఒకవేళ ఎలాగూ ఎనంకల ముందు వరాలూ తరువాత క్షవరాలుకి అలవాటుపడ్డవాళ్ళం కాబట్టి ఎవరైనా గుర్తుపట్టి తమ కు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుందామని వెళ్ళినా మన వోటు అప్పటికే ఎవరో ఒకరు వేసేసి వుంటారు కాబట్టి "తెల్ల " మొహం వేసుకుని వెనక్కి రావలసి వుంటుంది..

రాజకీయం రంగు తెలుసుకోవడం సామాన్య ఓటరు కి అర్ధం కాదు..

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates