Monday, November 30, 2009

ఆర్యా థూ

 ఆర్యా థూ
దీనికి ఇంతకన్నా మంచి పేరు నాకు తోచలేదు. ఒక అద్భూతమైన  ముక్కోణపు ప్రేమ-స్నేహం-పైత్యం-త్యాగం-మూర్ఖత్వం- ల సమ్మేళణం గా మలచిన విచిత్ర రాజం అనిపించిన సినిమా.

అసలు ఆర్య లోనే ఆ పాయింటు అర్ధం కాక తికమక పడ్డా. ఇప్పుడు ఈ రెండో భాగం చూశాక అసలు వీళ్లకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని అర్ధం కాలేదు.

ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు.అంటే ఒకళ్లకోసం ఒకళ్లు ప్రాణాలిచ్చేంత అని అపార్ధం చేసుకోకూడదు. వాళ్ల విచిత్ర స్నేహం తో మన ప్రాణం తీస్తారని అర్ధం. హీరో ఎవరికీ తెలీకుండా తాగిన, వాగినా, జనాల్ని కొట్టినా, సైటు తిట్టినా, హీరో కాబట్టి గ్రేటు..ఆయన గ్రేట్ నెస్ చూపాలంటే ఇంకోణ్ని వెధవని చెయ్యాలి. అంత ప్రాణ స్నేహితులు..ఎప్పటికప్పుడు హీరో ఫ్రెండు చెడ్డవాడిగా పనికిరానివాడిగా, చూపిస్తూ హీరోగారు మాత్రం మిస్టర్ పెర్ఫెక్త్ గా నిలుస్తుంటాడు. ఆయనంటే ఎంత గురి అంటే..హీరో లిఫ్టులో ముద్దు పెట్టాడు అని హీరోయిన్ చెప్పినా అదేదో టీ వీ లో టెలి బ్రాండ్ ఎడ్వర్టైజ్ మెంట్ లా చూసి నవ్వుకుని వెళ్లిపొతారు. ఆయన మాత్రం ఎంచక్క లేడీస్ టాయ్లెట్ లోకెళ్ళి మందు కొట్టి, ఆవకాయ నంచుకుని..బయటకొచ్చి బుడ్డిమంతుడు సారీ బుద్ధిమంతుడిలా నుంచుంటాడు..ఇక్కడా హీరోయిన్ పాపం బకరీ అవుతుంది..వీరి పైత్యానికి సపోర్ట్ గా బ్రహ్మానందం బ్యాచి, ఓ ముసుగు కారు,,మరిన్ని వింతలు..

ఇక హీరోగారు, హీరో ఫ్రెండు గారు సిగరెట్ మీద సగం సగం పేరు రాసుకుని..సగం సగం పంచుని, తాగుతూ, ఆ బూడిద మనమీద వేస్తుంటారు. ఒక సిగరెట్ తాగినట్టుగానే ఒక అమ్మాయినే ప్రేమిస్తారు. చివరికంటా సిగరెట్టులానే మార్చి మార్చి పంచుకుంటారు. స్నేహం కోసం ఏమైనా చేసే..మన హీరో గారు హీరోయిన్ ను ఫ్రెండ్ కి అందించడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. మామూలుగానే ఫాక్షన్ లీడర్ గారైన హీరోయిన్ తండ్రిగారు...తాను మీ అమ్మాయి ప్రేమికుడిని అని చెప్పినా హీరోని ఏమీ అనక పోగ..అప్పట్నుంచీ హీరో ఏం చెబితే దానికి తల ఊపి, పెళ్లి చెడిపోయిన తరువాత తన కూతుర్నిచ్చి పెళ్ళికూడా చేస్తాడు.
ఇక ఇక్కడనుంచీ హీరో గారి హీరోయిజం ముందు మన భారత దేశం, మన సంప్రదాయం, పెళ్లి పై ఉన్న అభిప్రాయం, ఇవన్ని చిన్నబోతాయి. పెళ్లి చేసుకున్న తన భార్య ఐన ప్రియురాలిని..ఫ్రెండుకిచ్చి పంపించేసి మామ గారింటికి వెళ్లి పోతాడు మన హీరోగారు. ఫ్రెండుని ప్రియురాలిని అమెరికా పంపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసేసి..పాపం ఫ్రెండు సిగరెట్టు మానెస్తాడేమో అని సగం సిగరెట్ట్లు తాగెసి పోగేసి హీరోయిన్ కం ప్రియురాలికి గిఫ్టు ఇస్తాడు. ఆ త్యాగం, చూసి చెలించిన చెలి అదేనండీ ప్రియురాలు తండ్రికి ఫోను చేసి పిలిపిస్తుంది..ఫ్రెండు ని పొడవబోయి అల్లుణ్ణి పొడుస్తాడు.
హాస్పటల్ లో జ్`నానోదయం అయిన ఫ్రెండు ప్రియురాలిని భర్తకి ఒదిలేసి కధ సుఖాంతం చేస్తాడు. ఆహా ఆక్సిజన్ సిలిండర్ ఆపినా బతికే హీరోగారు..ఎవర్ని ప్రేమించిందో తెలీని హీరోయిన్ కలిసిపోతారు. గ్రేట్ ఐడియా...

రింగ రింగ పాటలో అర్ధం బాగాలేదని గొడవ చేసిన.. వారికి  ..సినిమా చూస్తే ఇంక ఏమనిపిస్తుందో..మరి. అసలు సెన్సార్ అన్నది ఉందా. వారి పనేంటో..సినిమాలో సీనులు చూసి దాని బట్టి సర్టిఫికేట్ ఇవ్వడమేనా..ఇలాంటి అద్భుతాలు కనిపించినప్పుడు పట్టించుకోరా. హీరోలు...దర్శకులు వాళ్లకేది అనిపిస్తే అది తీసేసి జనం మీదకి తోసెయ్యడమేనా..పాట లో మార్పులు చేసారు.సినిమాలో, కానీ అప్పటికే విడుదలైన సీడీల మాటేమిటి..ఇక నుంచీ ఆడియోకి కూడా సెన్సారుండాలా విడుదల కి ముందు ఎవరైనా విని ఓకే చేసే పరిస్థితి వస్తుందా.? అసలు పైత్యానికి పరాక్ష్టగా ఉన్న వీళ్ల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..ఎనిమిదేళ్ల అబ్బాయి ఏదో రసాయన చర్యలతో పెద్దగా ఐపఓయి. పెళ్ళి చేసుకుని, ఒక పూట చిన్నగా, ఒక పూట పెద్దగా ఉండే లాంటి కధలల్లే అపర మేధావులు, స్నేహం కోసం భార్యని త్యాగం చేసే మిస్టర్ పెర్ఫక్ట్ గార్లు, అబ్బ తెలుగు సినిమా పతాకం ఎక్కడో రెప రెప లాడుతోంది. రేపటి రోజు సినిమా తలుచుకుంటే భయమేస్తోంది.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Sunday, November 15, 2009

పేరంటం



ఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.


ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...


బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే  ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....


సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.


పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.


ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, November 13, 2009

యాక్ నిరంజన్

 యాక్ నిరంజన్
ఈ సినిమా మొదటి రోజునే చూసేసా. కానీ తేరుకుని ఈ పోస్టు రాయడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు వీళ్ళేమనుకుంటారో అర్ధం కాదు. బిల్లా సినిమాలో హీరోయిన్ లకి బికినీలేసి సారేమో తెల్ల సూట్లేసుకుని మలేసియానో అదేదో దేశం లో అటూ ఇటూ తిరిగాడు..ఇందులో ఏకంగా బేడీలు బొడ్లో దోపుకుని రౌడీల వెంటబడతాడు. ఏమిటో అంతా జగన్నాధుని మాయ.

నేను బాగా చూసి అర్ధం చేసుకున్న విషయం ఏమిటంటే ,.ఈయన చిన్నప్పుడు అంటే కొంచెం పెద్దయ్యాకే..ఏ పోలీసు ఉద్యోగం కోసమో ట్రై చేశాడు ...కానీ అది రాలేదు..అని. ఎందుకంటే ..ఈయన గారి మొదటి సినిమా..బాచి లో జగపతి బాబు పోలీసు...(అనచ్చోలేదో) అమెరికా స్టైల్లో తెల్లటి డ్రస్సు..చొక్కాకి రెండు తుపాకులు .....ఊ అంటే అది తీసి ఆయన ఫైరింగు. ఇక ఇడియట్ లో ఐతే ఆయన మోటో పోలీసు ఆఫీసర్ అవడమే..పోకిరి డిటో ఆల్రెడీ పోలీసు..కానీ పోకిరి..ఇప్పుడు ఇందులో చిన్నప్పడు ఒకణ్ణి పట్టించి.ఒకరూపాయి అందుకున్న పాపానికి (మన పాపానికే) పెద్దయ్యేసరికి పోలీసు ఇంఫార్మర్ గా(దీనికి సార్ ఇంకేదో పేరు కూడా పెట్టాడు) బేడీలు కూడా వేసే స్థాయిలో  మన హీరోగారు. హీరోయిన్ సరే సరి పాపం గిటారు నేర్పుతూ ఉంటుంది కొంత మంది పిల్లలకి..చాలా పేద పిల్ల కావడం వల్ల పాతిక వేల రూపాయల గిటారు కొనుక్కోవాలి కాబట్టి చిన్నప్పటి గౌన్లు అవీ వేసుకుని..గిరజాల జుట్టూ...కెనెటిక్ బండీ (సుమారు నలభై వేలుండదూ)
అన్నని చితక్కొట్టి జైల్లో పడేసిన హీరోగారి ప్రేమలో పడి..ఇంక ఆ తరువాత ..!!!!

సొంత గాంగులో వాళ్లని కూడా సరదాకో..దురదకో..ప్రాక్టీసుకో..పైత్యానికో చంపేసే విలన్ గారు మన హీరోగారు ఎన్నిసార్లు..ఏమి చేసినా..ఊరుకుని..చివరివరకు  తన్నులు తింటుంటాడు. ఆలి లేని లోటు తీరచాడు సినిమాకి.
తల్లిని ఏదో అనడం...చెయ్యడం..తండ్రిని చంపడం..లాంటివీ షరా మామూలే.వీరి సినిమాలో..
ఇంకో ట్విస్టు...అసలే రకరకాల ప్రాబ్లెంసు..వీసా గొడవలు..విదేశీ ప్రయాణాలూ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో..హీరోగారికి ఫోనొచ్చిన మరుక్షణం పోలీసులకో ఇంటర్పోల్ వాళ్లకో అన్నట్టుగా...మరుక్షణం సార్ బాంకాక్ లో ప్రత్యక్ష్యం. ఆదిత్యరాం టికెట్ పెట్టినా...వీసా పాస్పోర్ట్ ఎవరిచ్చారో ? మరో వింతేమిటంటే బాంకాక్ లో పబ్బులో మైకేలు జాక్సన్ గారికి తెలుగు నివాళి.ధన్య జీవి,,,మన పూరీ గారికి మైకేలంటే చాలా ఇష్టమట..అందుకే వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్లో ఒకటి జాక్సన్ మరోటి మైకేలూను. బాగు బాగు....భౌ భౌ సంగీత సార్వాభౌ ' ముడు కదా.

హీరో అనగా...చింపిరి జుట్టు..మాసిన గడ్డం,,,,చదువు సంధ్య లేకపోవడం...సిగరెట్టు..మందు కొట్టడం..దేవుణ్ని నమ్మకపోవడం..దొరికిన వాణ్ని తన్నడం...వగైరా పూరీ మార్కు హీరో లక్షణాలన్ని ఉన్న యాక్ నిరంజన్ కు జోహార్.



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Wednesday, November 11, 2009

షిఫ్ట్ డెలిట్




షిఫ్ట్ డెలిట్
కంప్యూటర్ వాడేవారందరికీ ఇది తెలిసే ఉంటుంది..షిఫ్ట్ డెలిట్ అంటే పెర్మినెంట్ గా తొలగింపు అని...
హస్తినా పురం లో అడ్మినిస్ట్రేటర్  మాత ..ప్రస్తుతం అదే చేసినట్టున్నారు?
వై ఎస్ ప్రోగ్రాం సడెన్ గా క్రాష్ కాగానే...వెంటనే రన్ అవుతుందనుకున్న సబ్ ప్రోగ్రాం జగన్ సాఫ్ట్ వేర్ కి టెస్టింగ్ కాలేదని..ఓల్డ్ వెర్షన్ ఐనా రోశయ్య టూల్ నే ఎంచుకున్నారు.

మాటి మాటికి సీ ఎం వెర్షన్ మార్చే కాంగ్రెస్ లో .. మార్పు అవసరం లేకుండా నెట్టుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టం వై ఎస్. కొత్తగా తెచ్చిన..ప్రోగ్రాం లు.. ఇంకా కొన్ని సబ్ ప్రోగ్రాం లు.. ఇందిరా రాజీవ్ ల పేరున తయారు చేసిన స్టైల్ షీట్లు..ఒకటేమిటి..మళ్లీ ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం లేకుండా..నదిపించేసాడు...పాద యాత్రలు అలవాటు కదా.కానీ సడెన్ గా క్రాష్ అవడం తో..ప్రస్తుతం అగమ్యగోచరం అనుకుంటున్న తరుణం లో రోశయ్య రూపంలో ఓల్డ్ వెర్షన్ దొరికింది..కాంగ్రెస్ సెర్వర్ కి.

చూద్దాం  ఏం జరుగుతుందో..



Wednesday, November 4, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates